లాక్ డౌన్ పొడిగింపుతో.. పూజారి ఆత్మహత్య

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. దీంతో దేశంలో మరోసారి 19రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. అంటే మే3వ తేదీ వరకు యథాతథ పరిస్థతి కొనసాగించేలా ఆదేశించారు. అయితే ఈ విషయం కొంతమందికి ఇబ్బందికరంగా మారింది. దేశంలో లాక్‌డౌన్ పొడిగించడంతో మనస్తాపానికి గురైన ఓ పూజారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే కర్ణాటకలోని ఉడుపి ప్రాంతానికి చెందిన కృష్ణ.. ముంబైలోని కండివలీ ప్రాంతంలో దుర్గామాత ఆలయంలో పౌరోహిత్యం చేస్తున్నారు. సహచర పూజారులతో కలిసి ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు.

అయితే లాక్‌డౌన్ కారణంగా గత 21 రోజులుగా ముంబైలోని గదికే పరిమితమయ్యారు. నిన్నటితో లాక్‌డౌన్ గడువు ముగిసింది. దీంతో వెంటనే లాక్‌డౌన్ ఎత్తివేస్తే.. ఉడుపి వెళ్లాలని భావించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ.. కరోనా వైరస్‌ దేశంలో రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ నిన్న ప్రకటించారు. దీంతో ఇంటికి వెళ్లే మార్గం కనిపించక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ గదిలోనే కిచెన్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.