Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకుటుంబానికి చెందిన అబ్బాయిలను పెళ్లిచేసుకోడానికి ఎందరో అమ్మాయిలు క్యూ కడతారు. కోటీశ్వరుల , రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాల కుమార్తెలు రాజకుమారులతో జీవితం పంచుకోవాలని కలలు కంటారు. హోదాకు తగ్గట్టుగా కట్న కానుకలూ తీసుకువస్తారు. కానీ రాజకుమారులు మాత్రం ఇందుకు భిన్నంగా తమ జీవిత భాగస్వాములను ఎంచుకుంటున్నారు. ప్రపంచంలోని ఎన్నో రాజకుటుంబాల్లో ఇది జరుగుతోంది. గ్రేట్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఇంట్లోనూ రాజకుమారులు ఇలానే వ్యవహరిస్తున్నారు. ప్రిన్స్ చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియమ్స్ ఓ సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు.
రాజకుటుంబం నిబంధనలను పక్కనబెట్టి ప్రియురాలితో డేటింగ్ చేసిన విలియమ్స్ తన తోటి సాధారణ యువకుల్లానే ప్రవర్తించారు. ఇప్పుడు చార్లెస్ చిన్న కుమారుడు హ్యారీ కూడా తన పెళ్లి విషయంలో రాజకుటుంబ సంప్రదాయాలను పక్కకుపెట్టారు. ఇప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న ఓ మహిళను హ్యారీ పెళ్లాడబోతున్నాడు.
ప్రియురాలు నటి మేఘన్ మార్కెల్ తో హ్యారీ వివాహం వచ్చే ఏడాది జరగనుంది. ఇప్పటికే హ్యారీ, మేఘన్ ల నిశ్చితార్థం పూర్తయింది. ఈ మేరకు చార్లెస్ ఒక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబరు నెలలో ఇన్ విక్టస్ గేమ్స్ వద్ద హ్యారీ, మేఘన్ మార్కెల్ లు జంటగా కనిపించారు. అప్పటినుంచి వారిపై పుకార్లు షికారు చేశాయి. హ్యారీ మేఘన్ ప్రేమించుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ చార్లెస్ పెళ్లి ప్రకటన చేశారు. లండన్ లో నవంబర్ మొదటి వారంలో హ్యారీ మేఘన్ నిశ్చితార్థం జరిగినట్టు తెలిపారు.
వివాహానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. పెళ్లి అనంతరం హ్యారీ మేఘన్ తో కలిసి నాటింగ్ హామ్ కాటేజీలో నివసించనున్నారు. నటి అయిన మేఘన్ సూట్స్ టీవీ షోలో రేచల్ జేన్ పాత్ర ద్వారా పేరు తెచ్చుకున్నారు. హ్యారీ కంటే ఆమె వయసులో మూడేళ్లు పెద్ద. రాచరికపు కుటుంబాలు ఇలాంటి నేపథ్యమున్న అమ్మాయిని కోడలిగా అంగీకరించవు. మరి హ్యారీ ప్రేమకు పెద్దలు ఎలా ఒప్పుకున్నారన్నది తెలియాల్సి ఉంది.