ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. షూటింగ్లో పాల్గొన్న ఆయనకు కోవిడ్ అని తేలడంతో యూనిట్ సభ్యులు క్వారంటైన్లోకి వెళ్లారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన గణ మన’ అనే మూవీ షూటింగ్లో పృథ్వీరాజ్ పాల్గొన్నారు. కొచ్చిలో జరుగుతున్న ఈ షూటింగ్ చివరి షెడ్యూల్లో భాగంగా పాల్గొన్న యూనిట్ అందరికీ పరీక్షలు నిర్వహించగా పృథ్వీరాజ్‌తో పాటు డైరెక్టర్ ఆంటోనీకి సైతం కరోనా పాజిటివ్ అని తేలింది.
ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోయినా తనకు కరోనా వచ్చిందని, ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నట్లు పృథ్వీరాజ్ తెలిపాడు. త్వరలోనే కోలుకొని తిరిగి షూటింగ్లో పాల్గొంటానని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా సెట్లోని ఇద్దరికి కరోనా సోకడంతో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అంతేకాకుండా యూనిట్‌లోని మిగతా సిబ్బంది జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో తదుపరి సమాచారం వచ్చే వరకు షూటింగ్ నిలిపివేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.