మేయర్‌ పదవికి ప్రియా రాజన్‌

మేయర్‌ పదవికి ప్రియా రాజన్‌

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌గా ప్రియా రాజన్‌ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేడి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మేయర్‌ పదవికి ప్రియా రాజన్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసినట్టు వెల్లడించారు. తాజా ఎన్నికల్లో తిరు వి కా నగర్‌లోని 74వ వార్డు నుంచి డీఎంకే పార్టీ తరపున ఆమె గెలుపొందారు. కార్పొరేషన్‌కు ఎన్నికైన యువ కార్పొరేటర్లలో ఆమె ఒకరు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ చెన్నై మేయర్‌ పదవిని చేపట్టడం ఇదే మొదటిసారి. అతిచిన్న వయసులో చెన్నై మేయర్‌ పదవిని చేపట్టిన మహిళగా ఆమె ఖ్యాతికెక్కారు.

ప్రియా రాజన్‌.. పెరంబూర్‌ మాజీ ఎమ్మెల్యే చెంగై శివమ్‌ మనవరాలు. చెన్నై మహానగరంలో రహదారులు, పారిశుద్ధ్యం మెరుగుపడేందుకు ప్రాధ్యాన్యత ఇస్తానని ప్రియా రాజన్‌ తెలిపారు. స్త్రీల సమస్యల పరిష్కారానికి, మహిళా సాధికారతకు పాటు పడతానని ప్రకటించారు. కాగా, డిప్యూటీ మేయర్‌గా ఎం. మహేశ్‌కుమార్‌ ఎన్నికయ్యారు.తాజాగా జరిగిన నగర పాలక సంస్థల ఎన్నికల్లో 21 కార్పొరేషన్లను డీఎంకే పార్టీ కైవసం చేసుకుంది. అయితే మిత్రపక్షమైన కాంగ్రెస్‌ పార్టీకి కుంభకోణం నగర మేయర్‌ పదవిని అప్పగించింది. సేలం, కాంచీపురం డిప్యూటీ మేయర్ల పదవులను కూడా కాంగ్రెస్‌కు కేటాయించింది.