యమదొంగ సినిమాతో హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియమణి ఆ తర్వాత చేసిన సినిమాలు ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అదే సమయంలో ఆమె కన్నడ, మలయాళ చిత్రాలను దృష్టిపెట్టి అక్కడ బిజీ అయ్యింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోన్న ప్రియమణి మళ్లీ కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఒకేసారి రెండు బడా చిత్రాల్లో అవకాశాలు ఆమెను వరించాయి. రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వంలో ఇప్పటికే కీలక పాత్ర పోషించిన ప్రియమణి, వెంకటేశ్ సరసన నారప్ప సినిమాలోనూ నటించింది.
ఇందులో వెంకటేశ్ భార్యగా నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ రెండు సినిమాలు తన కెరీర్‌లో చాలా ముఖ్యమైన ప్రాజెక్టులుగా నిలిచిపోతాయని పేర్కొంది. ఇక వెంకటేశ్‌తో నటించే అవకాశం తనకు గతంలోనే మూడు సార్లు వచ్చిందని, పలు కారణాల చివరి నిమిషంలో చేజారిపోయాయని తెలిపింది. ఇన్నాళ్లకు వెంకటేశ్‌తో నటించాలనే తన కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తుంది. నారప్ప, విరాటపర్వం రెండు సినిమాల్లో తాను పోషించిన పాత్రలకి మంచి గుర్తింపు వస్తుందని చెప్పింది.