ఇంతకుముందు నటీమణుల పరిస్థితి వేరుగా ఉండేది : ప్రియమణి

ఇంతకుముందు నటీమణుల పరిస్థితి వేరుగా ఉండేది : ప్రియమణి
హీరోల పారితోషికం ఎప్పుడూ హీరోయిన్ల కన్నా ఎక్కువే ఉంటుందనుకోండి. పాపం హీరోయిన్ల పరిస్థితే ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ప్రస్తుతం అగ్ర కథానాయికలుగా రాణిస్తూ తమ స్థాయికి తగ్గ రెమ్యునరేషన్ తీసుకుంటున్నవారిల సమంత, నయనతార, అనుష్క శెట్టి మాత్రమే ఉన్నారు. వారు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌పై తాజాగా ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి స్పందించారు. మొత్తానికి వారికి దక్కాల్సిన పారితోషికం దక్కుతోందని హర్షం వ్యక్తం చేశారు. ‘ఇంతకుముందు నటీమణుల పరిస్థితి వేరుగా ఉండేది. వారికి కావాల్సింది నోరు తెరిచి అడగలేని పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాదు. వారి అర్హతకు తగ్గట్టు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. అందుకు నేను సంతోషిస్తున్నాను. నయనతార, సమంత, అనుష్క ఇందుకు ఉదాహరణలు’ అన్నారు.
అనంతరం ఇండస్ట్రీని షేక్ చేసిన మీటూ గురించి మాట్లాడుతూ.. ‘దాదాపుగా చాలా మంది దీని గురించి మాట్లాడారు. ఇండస్ట్రీకి చెందిన నటీమణులు తమ అభిప్రాయాలను ధైర్యంగా బయటపెట్టడం చూసి ఎంతో గర్వపడ్డాను. అయితే ఈ లైంగిక వేధింపులు అనేవి కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే లేవు. ఇంట్లో, యూనివర్శిటీల్లో, సాఫ్ట్‌వేర్ ఆఫీసుల్లో, కాల్ సెంటర్లలో ఇలా అన్ని చోట్లా ఈ సమస్య ఉంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్సి సెన్సిటివ్‌గా భావించాలి. ఒక నటి తాను ఫలానా వ్యక్తి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పినప్పుడు ఆమెని తప్పుపట్టకూడదు. ఇప్పుడు మీటూ చాలా పవర్‌ఫుల్ అయింది కాబట్టి అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు’ అని వెల్లడించారు ప్రియమణి.