సిక్కింపై ప్రియాంక చోప్రా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

priyanka chopra controversy comments on sikkim

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా అవ‌గాహ‌న లేకుండా చేసిన ఓ వ్యాఖ్యపై తీవ్ర దుమారం చెల‌రేగింది. సిక్కిం రాష్ట్రంలో రాజ‌కీయ అల‌జ‌డి ఉంద‌ని, తిరుగుబాటు ప‌రిస్థితుల‌తో ఆ రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొంటోంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె నిజాలు తెలుసుకుని మాట్లాడాల‌ని మండిప‌డుతున్నారు. ప్రియాంక నిర్మించిన చిత్రం ప‌హునాలో న‌టించిన భార‌త‌ ఫుట్ బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా కూడా దీనిపై స్పందించారు. ప్రియాంక మాట‌లు రాష్ట్ర‌ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను తీవ్రంగా బాధించాయ‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. సిక్కిం గురించి ఆమెకు ఎవ‌రో త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని భుటియా అన్నారు.

దేశంలోనే సిక్కింకు రాజ‌కీయ‌ప‌రంగా అత్యంత శాంతియుత‌మైన రాష్ట్రంగా పేరుంద‌ని, ఈ ఘ‌న‌త అంతా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కే సొంత‌మ‌ని ఆయ‌న అన్నారు. 1975లో సిక్కిం భార‌త్ లో భాగ‌మైంద‌ని… అప్ప‌టినుంచి ఇప్ప‌టిదాకా రాష్ట్ర రాజ‌కీయ ప‌రిస్థితుల్లో ఎలాంటి అల‌జ‌డి లేద‌ని ఆయ‌న చెప్పారు. ఈశాన్య‌ప్రాంతాల్లో అశాంతి ఉంటుంద‌న్న మాట నిజ‌మే అయినా… సిక్కింకు ఇది వ‌ర్తించ‌ద‌ని ఆయన తెలిపారు. అటు త‌న వ్యాఖ్య‌ల‌పై ప్రియాంక చోప్రా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఈ మేర‌కు సిక్కిం ప్ర‌భుత్వానికి లేఖ రాశారు.

ప్రియాంక అస‌లు ఈ వ్యాఖ్య చేయ‌టానికి కార‌ణమేంటంటే… ఆమె ఇటీవ‌ల త‌న సొంత బ్యాన‌ర్ లో ప‌హునా అనే చిత్రాన్ని నిర్మించారు. సిక్కిం భాష‌లోనే ఉన్న ఈ సినిమాను టొరంటో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ప్రియాంక ప‌హునా సిక్కిం వాసుల చిత్ర‌మ‌ని, ఇప్ప‌టివ‌ర‌కూ ఆ రాష్ట్రం నుంచి ఎవ‌రూ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు రాలేద‌ని, ఇదే ఆ ప్రాంతం నుంచి వ‌స్తున్న మొద‌టి సినిమా అని చెప్పారు. అక్క‌డ సినిమాలు తీయ‌క‌పోటానికి కార‌ణం రాష్ట్రంలో తిరుగుబాటు కార‌ణంగా నెలకొన్న ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఎప్పుడూ శాంతియుతంగా ఉండే సిక్కిం గురించి తెలుసుకోకుండా ప్రియాంక ఈ వ్యాఖ్య‌లు చేయ‌టం నెటిజ‌న్లకు ఆగ్ర‌హం తెప్పించింది.