ఇండియన్ సినిమాను ప్రపంచస్థాయిలో పాపులర్ చేస్తున్న నటీనటుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. గతంలో ఓసారి ఆస్కార్ అవార్డులకు అతిథిగా వెళ్లారామె. తాజాగా ఆస్కార్‌ను ఇంటికి తీసుకురావడానికి వెళ్తున్నారని సమాచారం. ప్రియాంకా చోప్రా నటిస్తున్న తాజా చిత్రం ‘ది వైట్ టైగర్’. ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కోసం ఈ సినిమా చేస్తున్నారామె.
వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్ వేడుకలో ఈ చిత్రం తరఫున ఉత్తమ సహాయ నటి విభాగంలో ప్రియాంక చోటు దక్కించుకునే అవకాశం ఉందని టాక్. ఈ లిస్ట్‌లో ఆల్రెడీ హాలీవుడ్ స్టార్స్ మెరిల్ స్ట్రీప్స్, క్రిస్టిన్ స్కాట్ థామస్, ఒలీవియా కోల్మన్ ఉండొచ్చని తెలిసింది. మరి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను ప్రియాంక గెలుచుకుంటారా? వేచి చూడాలి. ఇండో–ఆస్ట్రేలియన్ రచయిత అరవింద్ అడిగి రచించిన ‘ది వైట్ టైగర్స్’ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందిస్తున్నారు. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం విడుదలవుతుంది.