వచ్చే సంక్రాంతి పండగ రిలీజ్ రేసులో ఎన్టీఆర్-రామ్‌చరణ్‌ల ‘రౌద్రం.. రణం.. రుధిరం’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, పవన్ కల్యాణ్-రానాల ‘భీమ్లా నాయక్’ చిత్రాలు ఉన్నాయి. అయితే ‘యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ’ అభ్యర్థన మేరకు సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకుంది. ఈ విషయం గురించి యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున నిర్మాతలు ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య స్పందించారు.
‘‘సంక్రాంతి రేసులో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ చిత్రాలు నిలిచాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియన్ సినిమాలు. ఈ రెండు సినిమాలు దాదాపు మూడేళ్లుగా వర్క్స్ జరుపుకుంటూనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయన్న కారణంగానే జనవరి 7న విడుదల కావాల్సిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం ఫిబ్రవరికి వాయిదా పడింది. అలాగే ఒకేసారి మూడు పెద్ద సినిమాలు విడుదలైతే స్క్రీన్స్ షేరింగ్ విషయంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం కావొచ్చు.
ఈ పరిస్థితిలోనే సంక్రాంతి రేసు నుంచి ‘భీమ్లా నాయక్’ తప్పుకోవాల్సిందిగా ఈ చిత్రనిర్మాత రాధాకృష్ణ, హీరో పవన్‌ను కోరితే, వారు సానుకూలంగా స్పందించారు. జనవరి 12న విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న విడుదలవుతుంది. అలాగే ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన ‘ఎఫ్ 3’ సినిమాకు నిర్మాతను నేనే. ‘ఎఫ్ 3’ని ఏప్రిల్ 29కి వాయిదా వేస్తున్నాం. తమ అభిమాన హీరోలను వీలైనంత త్వరగా థియేటర్స్‌లో చూసుకోవాలని ఫ్యాన్స్‌కు ఉంటుంది. అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నాం. ఈ విషయాన్ని అందరి హీరోల అభిమానులు అర్థం చేసుకోవాలి’’ అని దిల్ రాజు పేర్కొన్నారు.
‘‘భీమ్లా నాయక్’ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నందుకు నిర్మాత చినబాబు, త్రివిక్రమ్, పవన్‌లకు థ్యాంక్స్’’ తెలిపారు నిర్మాత డీవీవీ దానయ్య. ఈ సమావేశంలో నిర్మాతలు దామోదర ప్రసాద్, స్రవంతి రవికిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ఆర్’ జనవరి 7న, ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.