Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలకృష్ణ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన భార్గవ్ ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఎస్. గోపాల్‌రెడ్డి తనయుడు భార‍్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సముద్రంలో ఆయన మృతదేహం కొట్టుకు రావడం పలు అనుమానాలకి తావిస్తోంది. నిన్న సాయంత్రం నెల్లూరు జిల్లా వాకాడు మండలం పంబలిలోని తన ఆక్వా హేచరీ దగ్గరకు వచ్చిన ఆయన అక్కడ నుంచి ఒంటరిగా సముద్రం ఒడ్డుకు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన ఎంతకూ తిరిగిరాకపోవడం తో భయపడిన హేచరీ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే భార్గవ్ రెడ్డి కనపడంలేదన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన హేచరీ దగ్గరకి చేరుకొని గాలింపు మొదలు పెట్టారు.
అయితే నిన్న పొద్దుపోయిన వరకు ఆయన ఆచూకీ దొరకలేదు. అయితే ఈ రోజు ఉదయం ఆయన మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకురావడం ఇప్పుడు పలు అనుమానాలకి తావిస్తోంది. ఈరోజు ఉదయం అంజలాపురం, శ్రీనివాసపురం గ్రామాల మధ్య పంబలి సముద్రం ఒడ్డున మృతదేహం అభ్యమైంది. ఒక కుక్క పిల్లను కాపాడేందుకు వెళ్లి సముద్రంలో పడి ఆయన మరణించినట్టు కొందరు చెబుతున్నారు. అయితే భార్గవ్ రెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు ఎలా చనిపోయాడనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయాడా, మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. మరో పక్క భార్గవ్ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం అలముకుంది.