కరోనా మహమ్మారి సినిమా నిర్మాతను బలి తీసుకుంది. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి లక్ష్మీ మూవీ మేకర్స్. కె మురళీధరన్, స్వామినాథన్, వేణుగోపాల్ మొదలగు ముగ్గురు నిర్మాతలు కలిసి ఈ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా అరణ్ మనై కావలన్ అనే చిత్రాన్ని తొలిసారిగా 1994లో నిర్మించారు.
ఆ తర్వాత గోకులంలో సీతై, ప్రియముడన్, భగవతి, అన్బే శివం తదితర పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. చివరగా ఈ సంస్థ జయం రవి హీరోగా సకల కళా వల్లవన్ చిత్రాన్ని నిర్మించారు. ఈ ముగ్గురు నిర్మాతల్లో ఒకరైన స్వామినాథన్ కొన్ని చిత్రాల్లో నటించారు. ఆయనకు ఇటీవలకు కరోనా వ్యాధి సోకింది. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం కన్నుమూశారు. నిర్మాత స్వామినాథన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.