గవర్నర్ vs సీఎం…రాజ్ భవన్ ఎదుటే నిద్ర !

Puducherry governor vs cm

ముఖ్యమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య అధికారాల విషయంలో మరో కేంద్రపాలిత రాష్ట్రంలో వివాదం చినికి చినికి గాలివానలా మారింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ తీరును వ్యతిరేకిస్తూ సీఎం వి. నారాయణస్వామి నిన్న సాయంత్రం గవర్నర్ ఇంటి ముందు బైఠాయించిన ఆయన, రాత్రి కూడా అక్కడే నిద్రించారు. ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు సైతం ఉన్నారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు పెట్టుకోవడం తప్పనిసరి చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ఆదేశాలు జారీ చేశారు.

అయితే గవర్నర్ చర్యలను తప్పుబట్టిన సీఎం నారాయణస్వామి, దశల వారీగా హెల్మెట్‌ నిబంధనను అమలు చేయాలని కోరారు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఇదే సమయంలో క్యాబినెట్ తీర్మానాల్ని కిరణ్‌బేడీ వెనక్కిపంపారు. దీంతో ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ వివిధ పథకాలకు సంబంధించి క్యాబినెట్ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నారంటూ సీఎం ఆందోళనకు దిగారు. నల్ల దుస్తులు ధరించి గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌ నివాస్‌ ఎదుట బైఠాయించి, రాత్రి కూడా రోడ్డుపైనే నిద్రపోయారు. ఈరోజు కూడా సీఎం నారాయణస్వామి దీక్ష కొనసాగుతోంది. నారాయణస్వామి ఆందోళనకు డీఎంకే సైతం మద్దతు తెలిపింది. మరోవైపు సీఎం నిరసనపై కిరణ్‌ బేడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు రాజ్‌నివాస్‌ను చుట్టుముట్టారు. మమ్మల్ని బయటకు వెళ్లనివ్వట్లేదు. సిబ్బందిని లోనికి రానివ్వట్లేదు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ప్రజాప్రతినిధులే చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.