మరో పుల్వామా తరహా దాడికి… మనసైన్యం చెక్

కరోనా ప్రపంచాన్ని వణికించేస్తున్నా.. కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడులకు మాత్రం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కశ్మీర్ లో భారీ దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. మరోసారి సైనికులునే టార్గెట్ చేస్తూ.. ఉగ్రవాదులు భారీ దాడికి వ్యూహ రచన చేశారు. కాగా సైన్యం సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.  పుల్వామాలో లష్కరే తొయిబా, జైషే మొహమూద్ ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నినట్టు సమాచారాన్ని తెలుసుకున్న సైన్యం అప్రమత్తమైంది. దీంతో పుల్వామాలో కారుకు అమర్చిన పేలుడు పదార్ధాలను గుర్తించి సైనికులు నిర్వీర్యం చేశారు. ముందస్తు సమాచారంతో ఉగ్ర కుట్రను సీఆర్పీఎఫ్, సైనిక బలగాలు భగ్నం చేశాయి.

 సైనిక వాహనాలు తనిఖీ కేంద్రం వద్ద కారులో ఐఈడీని భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో కారుపై భద్రతా బలగాలు కాల్పులు జరపగా.. ముష్కరుడు దానిని వదలి పరారయ్యాడు. ఆ తర్వాత మనసైన్యం కారులో పేలుడు పదార్ధాలను నిర్వీర్యం చేసింది. పేలుడు పదార్ధాలు అమర్చిన కారులో ఉగ్రవాది వెళుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు బుధవారం రాత్రి పుల్వామా పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో వెంటనే సైన్యం  అప్రమత్తమై సీఆర్పీఎఫ్, ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు.. అన్ని మార్గాలను జల్లెడ పట్టారు. పైనల్ గా వాహనాన్ని గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే వారు విడిచిపెట్టి వెళ్లిన వాహనంలో మొత్తం 20 కిలోలకు పైగా పేలుడు పదార్థాలున్నట్టు అధికారులు తెలిపారు. వెంటనే తెలుసుకొని చర్యలు తీసుకోవడంతో సైన్యానికి పెద్ద ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. కాగా 2019 ఫిబ్రవరి 14 పుల్వామాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అలాంటిదే మరోసారి ఉగ్రవాదులు ప్లాన్ కు మనసైన్యం చెక్ పెట్టింది.