పంజాబ్‌లో గెలుపు ఖరారు కాలేదు కానీ, కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు మాత్రం పెరిగిపోతున్నారు. గతేడాది సీఎం పదవి నుంచి అమరీందర్ సింగ్ వైదొలిగిన అనంతరం 42 మంది కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు తనను సీఎంగా సమర్థించారని కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ జాఖడ్ చెప్పారు. అభోర్‌లో ఒక సమావేశంలో సునీల్ ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో మం గళవారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఆ సమయం లో తనకు 42 మంది, సుఖీందర్ సింగ్ రణ్‌ధవాకు 16 మంది, మహారాణి ప్రణీత్ కౌర్ కు 12 మంది, సిద్ధూకు 6 గురు, చన్నీకి ఇద్దరు మద్దతు పలికారని సునీల్ చెప్పారు.
పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థ్ధి పేరును ఈనెల 6న రాహుల్‌గాంధీ ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఇప్పటికే సోనియా గాంధీ పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. శక్తి యాప్‌లో కార్యకర్తల అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టానం సేకరిస్తోంది. దీంతో పాటు రెండ్రోజులుగా సామాన్య ప్రజల అభిప్రాయం కూడా తీసుకుంటోంది. ఆరున పంజాబ్‌లో పర్యటించి అభ్యర్ధి పేరును రాహుల్ ప్రకటించవచ్చని అంచనా. గత కొన్ని వారాలుగా తమనే సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని ప్రస్తుత సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సునీల్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.