వీళ్ళు దేన్నీ వదలరురా బాబు !

Thai Cave Rescue movie

గుహలో చిమ్మ చీకటిలో 12 మంది బాలలు, వారి కోచ్అంతూపొంతూ తెలియని గుహ ! ఎంత లోతుందో తెలియనంత నీరు! బయటకు రాలేక ఆర్నెల్లు అక్కడే ఉండాలని భావించి, నాటకీయ పరిణామాల మధ్య వారంతా బయటకు రావడం, వారిని కాపాడేందుకు అనేక దేశాలకు చెందిన డైవర్స్‌ కదిలి రావడం, మధ్యలో వారికి సాయపడేందుకు వెళ్లిన డైవర్ మరణించడం, గుహలో చిక్కుకుపోయి, మట్టి నీరు తాగడం, దట్టమైన అడవి మధ్యలో భయంకరమైన గుహ, చుట్టూ నీరు, చిమ్మ చీకటి, గంటల తరబడి గుహలో ప్రయాణం, భారీ వర్షాలు, అనేక మలుపులు. ఆసక్తికరమైన అంశాలు. ఉత్కంఠ భరిత క్షణాలు! చివరికి కథ సుఖాంతం! ఒక సినిమా తీయడానికి ఇంతకంటే ఏం కావాలి! అందుకే ధాయ్ లాండ్ ఫుట్ బాల్ జూనియర్ టీమ్ రెస్క్యూ కథను ఆంగ్ల చిత్రంగా మలచాలని ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్ నిర్ణయించింది. అందుకే… థాయ్‌ గుహ కథతో ‘కేవ్‌ రెస్క్యూ’ అనే హాలీవుడ్‌ సినిమా రానుంది. ప్యూర్‌ ఫ్లిక్స్‌ ఎంటర్టైన్‌మెంట్‌ అనే సంస్థ దీనికి సంబంధించిన హక్కులను పొందేందుకు ప్రయత్నిస్తోంది.

కావోస్ ఎంటర్ టెయిన్ మెంట్ కు చెందిన ఆడమ్ స్మిత్ తో కలసి తాను ఈ చిత్రాన్ని నిర్మించతలచానని, ఇందుకు రూ. 400 కోట్ల వరకూ (సుమారు 60 మిలియన్ డాలర్లు) వెచ్చిస్తానని ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్ సీఈఓ మైఖేల్ స్కాట్ తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రకటించారు. ఈ వాస్తవ కథ హక్కులను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కథలో సాహసం, హీరోయిజం ఉన్నాయని, దాన్ని తాను స్పష్టంగా గమనించానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తాను 90 మంది డైవర్లతో మాట్లాడానని అన్నారు. ఇది కేవలం సినిమా కాదని, ఈ సాహస కార్యంలో పాల్గొని మరణించిన డైవర్ సహా ప్రతి ఒక్కరికీ నివాళిగా ఈ చిత్రం తీస్తానని చెప్పుకొచ్చారు. ప్యూర్ ఫిక్స్ కో-ఫౌండర్ డేవిడ్ వైట్ మాట్లాడుతూ… స్కాట్ ఇప్పటికే డైవర్స్‌ని ఇంటర్వ్యూ చేసేందుకు థాయ్‌లాండ్ వెళ్లారని తెలిపారు. ఆల్రెడీ తాము నటీనటులు, రైటర్స్, డైరెక్టర్స్ వేట మొదలు పెట్టామని వెల్లడించారు. ఈ సినిమా రూ.400 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని టాక్.