స్మగ్లింగ్ కేసులో ప్రముఖ జబర్దస్త్ నటుడు !

Jabardasth actor in smuggling case

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడానికి పోలీసులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం మాత్రం యధేచ్చగా తరలిపోతోంది. తాజాగా ఎర్రచందనం స్మగ్మింగ్‍లో ‘జబర్దస్త్’ నటుడుకి సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. నిన్నటి వరకూ ఎలాగైనా నటుడిగా నిరూపించుకోవాలన్న లక్ష్యంతో దొరికిన పాత్రలన్నీ చేస్తూ, టీవీ సీరియల్స్ లో నటిస్తూ, జబర్దస్త్ కార్యక్రమంలో నవ్వించిన సాదా సీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ కోట్లకుపైగా సంపాదిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. తిరుపతికి చెందిన ఈ ఆర్టిస్టు.. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టు హీరోగా నటించిన సినిమాకు కూడా భారీ మొత్తంలో ఫైనాన్స్ చేసినట్టు సమాచారం.

తిరుపతికి చెందిన ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్ గురించి పక్కా ఆధారాలు లభ్యంకావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇతని కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకల్లోని బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుని ఎర్రచందనం విక్రయిస్తూ డబ్బు సంపాదించాడు. ఇతనిపై 20 కేసులు నమోదు చేశామని చెప్పిన టాస్క్ ఫోర్స్ అధికారులు, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. మరికొన్ని సినిమాలకు ఫైనాన్స్‌ చేస్తున్నట్లు తెలిసింది. కొందరు విద్యార్థులు, పల్లెల్లో పనిచేసే డాక్టర్లు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఈ ఆర్టిస్ట్ తో చేతులు కలిపి ఎర్రచందనం అక్రమ రవాణాలో భాగమైనట్టు గుర్తించిన పోలీసులు వారిని గురించి ఆరా తీస్తున్నారు.