పూరీతో రామ్ సినిమా మొదలయ్యింది…!

Puri And Ram ISmart Shankar Starts Rolling

టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న పూరీ జగన్నాథ్ టెంపర్ తర్వాత హిట్ లు లేక డీలాపడ్డారు. ఆ సినిమా తరవాత పూరీ దర్శకత్వంలో ఆరు సినిమాలు వచ్చినా ఒక్కటీ హిట్టు కాలేదు. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా పూరీ తెరకెక్కించిన ‘పైసా వసూల్’ కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిడంతో హతేడాది తన కుమారుడు ఆకాశ్‌ను హీరోగా పెట్టి స్వయంగా నిర్మించిన ‘మెహబూబా’ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టి పూర్వవైభవాన్ని సంపాదించాలని పూరి చూస్తున్నారు. ఈసారి తన హీరోగా రామ్‌ను ఎంచుకున్నారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థలపై పూరి, చార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘ఇస్మార్ట్ శంకర్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్త సన్నివేశానికి చార్మి క్లాప్‌ను ఇచ్చారు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రేపటి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా పూరి వెల్లడించారు. పూరీ జగన్నాథ్‌కు ఇది 35వ చిత్రం కాగా రామ్‌కు 17వ సినిమా. పూరీ సినిమాల్లోని హీరోలాగా రామ్ కూడా రఫ్ లుక్‌లోకి మారిపోయాడు. మంచి మాస్ క్యారెక్టర్‌లో రామ్‌ను పూరి చూపించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.