అదరగొట్టిన సింధు

అదరగొట్టిన సింధు

భారత స్టార్‌ షట్లర్లు పూసర్ల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్‌ కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సత్తా చాటుతున్నారు. వీరిద్దరు అలవోక విజయాలతో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే రైజింగ్‌ స్టార్, ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ లక్ష్యసేన్‌కు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే చుక్కెదురైంది. డబుల్స్‌లో ఒక్క సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జోడీ తప్ప అంతా ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు.

మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 21–15, 21–10తో అయ ఒహొరిపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో మాల్విక బన్సోద్‌ 8–21, 14–21తో ఆరోసీడ్‌ పొర్న్‌పవీ చొచువాంగ్‌ చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ శ్రీకాంత్‌ 21–18, 21–6తో మిశా జిల్‌బెర్మన్‌ పై గెలిచాడు.

ఆరో సీడ్‌ లక్ష్యసేన్‌ 20–22, 9–21తో షెసర్‌ హిరెన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమిత్‌ రెడ్డి–అశ్విన్‌ పొన్నప్ప జంట 20–22, 21–18, 14–21తో ఐదో సీడ్‌ ఒయు జువాన్‌ యి–హువాంగ్‌ య కియంగ్‌ ద్వయంతో పోరాడి ఓడింది.

పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 21–15, 21–19తో హి యాంగ్‌–లో కియాన్‌ హీన్‌ జంటపై గెలుపొందగా, రెండో సీడ్‌ మొహమ్మద్‌ అసాన్‌–హెండ్రా సెతియాన్‌ తో జరిగిన పోరులో అర్జున్‌–ధ్రువ్‌ కపిల 8–5 స్కోరు వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగారు.