సీఎం కి ధన్యవాదాలు తెలిపిన స్టార్‌ షట్లర్‌

సీఎం కి ధన్యవాదాలు తెలిపిన స్టార్‌ షట్లర్‌

జపాన్‌లోని టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారతదేశం తరఫున పాల్గొననున్న ఒలింపియన్స్‌ పీవీ సింధు, ఆర్‌ సాత్విక్‌సాయిరాజ్, రజనీలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో పీవీ సింధు తదితరులు బుధవారం సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కులను సీఎం అందజేశారు.

విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ కోసం కేటాయించిన రెండెకరాల భూమికి సంబంధించిన ఉత్తర్వులను సీఎం జగన్‌ పీవీ సింధుకు అందజేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారిణి రజనీ బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామ్‌గోపాల్, శాప్‌ ఉద్యోగులు వెంకట రమణ, జూన్‌ గ్యాలియో, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. క్రీడల అభివృద్ధికి నిరంతరం ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఉత్సాహ పరుస్తున్న సీఎం జగన్‌కు ఇవే నా ధన్యవాదాలు అని పేర్కొంది. ‘మా మూలాలను గుర్తించి, మమ్మల్ని గౌరవిస్తూ.. మీరిచ్చే ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ఆమె ట్వీట్‌ చేశారు.