ప్రతిష్టాత్మక థామస్ కప్ అండ్ ఉబెర్ కప్ ప్రధాన టీమ్ టోర్నమెంట్ నుంచి ప్రపంచ చాంపియన్, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వైదొలిగింది. వ్యక్తిగత కారణాలరీత్యా ఈ టోర్నీలో సింధు ఆడబోవడం లేదని ఆమె తండ్రి పీవీ రమణ బుధవారం వెల్లడించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఇటీవల సవరించిన షెడ్యూల్ ప్రకారం కరోనా తర్వాత జరుగనున్న తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే కావడం విశేషం. పురుషుల జట్లు థామస్ కప్ కోసం… మహిళల జట్లు ఉబెర్ కప్ కోసం తలపడతాయి.
అక్టోబర్ 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. దీంతోపాటు ఆ తర్వాత జరుగనున్న డెన్మార్క్ ఓపెన్ (అక్టోబర్ 13–18), డెన్మార్క్ మాస్టర్స్ (అక్టోబర్ 20–25) సూపర్–750 సిరీస్‌లలోనూ సింధు బరిలోకి దిగేది అనుమానంగానే ఉంది. ‘వ్యక్తిగత కారణాలతో థామస్ కప్ అండ్ ఉబెర్ కప్ ప్రధాన టోర్నమెంట్‌కు సింధు అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యమైన పని కారణంగా ఈవెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఈ మేరకు భారత బ్యాడ్మింటన్ సంఘానికి (బాయ్) కూడా సమాచారమిచ్చాం. తర్వాత జరిగే రెండు టోర్నీల్లో కచ్చితంగా పాల్గొంటుందని చెప్పలేను. ఎంట్రీలైతే పంపించాం. ఆ సమయంలోగా తన పని పూర్తయితే ఆ టోర్నీల్లో పాల్గొంటుంది’ అని రమణ తెలిపారు. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో ఏర్పాటైన ‘సాయ్’ జాతీయ శిబిరంలో గత నెల నుంచే పాల్గొంటున్న సింధు… కొరియా కోచ్ పార్క్ సంగ్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత బి. సాయిప్రణీత్, మాజీ వరల్డ్ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, డబుల్స్ ప్లేయర్ ఎన్. సిక్కి రెడ్డి శిబిరంలో పాల్గొంటున్నారు.