ఆ ప్ర‌శ్న చూసి ఎగిరి గంతేశారు

Question on Virat Kohli in 10th class English exam at West Bengal

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బండెడు పుస్త‌కాలు బ‌ట్టీయం వేయ‌డం… మూడు గంట‌ల ప‌రీక్షలో భ‌విష్య‌త్ తేల్చుకోవ‌డం. భార‌తీయ విద్యావిధానం ఇదే. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి, ఆపై ఇంట‌ర్ దాకా విద్యార్థుల‌కు స‌మ‌కాలీన విష‌యాల‌పై ఎలాంటి అవ‌గాహ‌న ఉండ‌దు. పుస్త‌కాల్లో ఉన్న‌ది, చ‌దివి రాసేసి, పై త‌ర‌గ‌తికి వెళ్లిపోతుంటారు. ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రులు కూడా పిల్ల‌ల‌కు పుస్త‌కాలు చ‌దువుకోమ‌నే చెబుతారు కానీ… మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంలో ఏమి జ‌రుగుతోందో వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌రు. పిల్ల‌లు మాత్రం ఇలాంటి ప‌రిస్థితుల మ‌ధ్యే త‌మ ఇష్టాయిష్టాల‌ను రూపొందించుకుంటారు. త‌ల్లిదండ్రుల‌కు, గురువుల‌కు ఇష్టం లేక‌పోయిన‌ప్ప‌టికీ… త‌మ ఆసక్తుల‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. సినిమాలు, క్రికెట్, రాజకీయాలు ఈ కోవ‌లోకే వ‌స్తాయి. రాజ‌కీయాల గురించి అంత‌గా తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ… సినిమాలు, క్రికెట్ మాత్రం పిల్ల‌లకు ఇష్ట‌మైన వ్యాప‌కాలు. అయితే సినిమాలు, క్రికెట్ చూడ‌డం చెడ్డ అలవాటు అని పిల్ల‌ల‌కు చెప్తుంటారు కొంద‌రు. మంచి, చెడూ అన్ని చోట్లా ఉన్న‌ట్టే ఆ రంగాల్లోనూ ఉన్నాయి.

సాధార‌ణ కుటుంబాల నుంచి వ‌చ్చి సూప‌ర్ స్టార్ ల స్థాయికి ఎదిగిన హీరోలు, హీరోయిన్లు, దేశాన్ని త‌మ వైపుకు తిప్పుకునే క్రికెటర్లు పిల్ల‌ల‌కు అత్యంత స్ఫూర్తిక‌లిగిస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. క్లాసు పుస్త‌కాల్లోని పాఠాల‌క‌న్నా వెండితెర‌, బుల్లితెర పిల్ల‌ల‌ను ఆక‌ర్షించ‌డం వెన‌క ఆయారంగాల్లోనివారికొచ్చే పేరు ప్రఖ్యాతులు కూడా ఓ కార‌ణం. అయితే మ‌న చ‌దువులు మాత్రం పుస్త‌కాల్లోని పాఠాలు త‌ప్ప ఇలాంటి విష‌యాలు నేర్పించ‌వు. త‌మకిష్ట‌మైన రంగాల‌పై పిల్ల‌ల‌కు ఎంత ఆస‌క్తి ఉంటుందో… వాటిని ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం వ‌స్తే పిల్ల‌లు ఎంత సంతోష‌ప‌డ‌తారో… ప‌శ్చిమబెంగాల్ లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న తెలియ‌జేస్తోంది.

ఆ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఎగ్జామినేష‌న్ సెంట‌ర్ కు వెళ్లి ఎప్ప‌టిలానే ప‌రీక్ష‌రాసేందుకు కూర్చున్న విద్యార్థులు ఇంగ్లీష్ క్వ‌చ్ఛ‌న్ పేప‌ర్ లోని ఓ ప్ర‌శ్న చూసి ఎగిరిగంతేశారు. ఆ ప్ర‌శ్న‌… భార‌త క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఓ వ్యాసం రాయ‌మ‌ని. పదిమార్కుల ఈ ప్ర‌శ్న విద్యార్థులంద‌రికీ సంతోషం క‌లిగించింది. ఇంచుమించు ప‌రీక్ష రాసిన విద్యార్థులంతా ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం రాశారు. ప‌దికి ప‌ది మార్కులు వ‌స్తాయ‌ని ఆనంద‌ప‌డుతున్నారు. దీనిపై మాజీ క్రికెట‌ర్ ర‌త‌న్ శుక్లా మాట్లాడుతూ కోహ్లీ గురించి అడ‌గ‌డం బాగుంద‌ని, ఇలాంటి ప్ర‌శ్న‌లడిగే విధానాన్ని ప్రోత్స‌హించాల‌ని సూచించారు. ర‌త‌న్ శుక్లానే కాదు… దేశంలో చాలామంది అభిప్రాయం ఇదే. పాఠ్య‌పుస్త‌కాల్లోని ప్ర‌శ్న‌లే కాకుండా స‌మ‌కాలీన ప‌రిస్థితుల గురించి విద్యార్థుల‌కు ప్ర‌శ్న‌లు ఇవ్వ‌డం ద్వారా వారిలో సామాజిక దృక్ప‌థాన్ని పెంచొచ్చ‌ని ఎంద‌రో ప‌రిశీల‌కులు అంటున్నారు. l