Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భక్తి పేరుతో బాబాలు చేస్తున్న మోసాలు బహిర్గతమవుతున్నా… ప్రజల వైఖరి మారడంలేదు. సాధారణ భక్తుల సంగతి పక్కన పెడితే. నకిలీ బాబాల గుట్టు రట్టు చేసే పోలీసు ఉన్నతాధికారులు సైతం మూఢభక్తిని వదిలించుకోవడం లేదు. వివాదాస్పద రాధే మా విషయంలో ఢిల్లీ పోలీసుల వైఖరే ఇందుకు నిదర్శనం. గత వారం రాధే మా తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. నిబంధనలకు విరుద్ధంగా ఆమె స్టేషన్ హౌస్ అధికారి కుర్చీలో కూర్చుంది. ఆమె దర్జాగా కుర్చీలో కూర్చుని ఉండగా… ఎస్ హెచ్ వో సంజయ్ శర్మ ఆమె ముందు చేతులు జోడించి నిల్చున్నాడు. ఎర్ర రంగు చున్నీని మెడకు కట్టుకున్న ఆ అధికారి వినమ్రంగా నవ్వుతూ నిల్చున్న ఈ ఫొటోపై తీవ్ర వివాదం చెలరేగింది.
ఈ ఫొటోలను ఓ ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రాధే మాకు అతిథి మర్యాదలు చేస్తున్న పోలీసులు అని క్యాప్షన్ పెట్టాడు. దీనిపై సంజయ్ శర్మ స్పందించాడు. రాధే మా తమ స్టేషన్ కు వచ్చినట్టు అంగీకిరంచాడు. సెప్టెంబరు 28న ఉదయం 11.30 గంటల సమయంలో రాధే మా తన అనుచరులతో కలిసి రామ్ లీలా ప్రాంతానికి వెళ్తూ తమ స్టేషన్ కు వచ్చిందని ఆయన చెప్పాడు. బాత్ రూంకు వెళ్లేందుకు ఆమె స్టేషన్ కు వచ్చిందని తెలిపాడు. టాయిలెట్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఆమె తనను అడగకుండానే తన కుర్చీలో కొన్ని నిమిషాల పాటు కూర్చుందని, వెంటనే స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని, తాను చేతులు జోడించి కోరానని సంజయ్ శర్మ వివరణ ఇచ్చాడు.
అయితే ఆ ఫొటో చూస్తుంటే… ఆయన రాధే మాను వెళ్లిపోవాలని కోరుతున్నట్టుగా లేదు. చేతులు జోడించి నవ్వుతూ తన వినమ్రతను చాటుకుంటున్నట్టు ఉంది. అటు ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. సంజయ్ శర్మ మీద విచారణకు ఆదేశించామని, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాధే మాపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. హిందీ పాటలకు డ్యాన్సులు చేస్తూ భక్తులను ఆశీర్వదించే రాధే మా అసలు పేరు సుఖ్వీందర్ కౌర్. ఆమెను దుర్గాదేవిగా భావిస్తూ కొందరు భక్తులు పూజలు చేస్తుంటారు.