సుమ పై కేసు వేస్తాను

కే రాఘవేంద్ర రావుకు మౌన ముని అని బిరుదు ఉంది. ఒకప్పుడు ఆయన మాటలు వినాలంటే ఎంతో కష్టమయ్యేది. పలుకే బంగారమాయేనా? అనేట్టు ఉండేది. కానీ ఈ మధ్య రాఘవేంద్ర రావు స్టేజ్ ఎక్కితే, మైకు దొరికితే దంచి కొడుతున్నారు. అలాంటి రాఘవేంద్ర రావు తాజాగా క్యాష్ షోకు గెస్టుగా వచ్చాడు. యాంకర్ సుమకు చుక్కలు చూపించాడు. మామూలుగానే యాంకర్ సుమ సోషల్ మీడియాలో, బుల్లితెరపై తన స్టైల్లో అందరినీ ఆడుకుంటూ ఉంటుంది.

ఇక ఆమె అల్లరి ఎలా చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఎంతటి వారినైనా సరే సుమ తన పంచులతో అల్లాడిస్తుంటుంది. ఎదుటివారు సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా సుమ కౌంటర్లు వేస్తుంటుంది. అయితే సుమ వేసే కౌంటర్లను అందరూ తేలిగ్గానే తీసుకుంటారు. ఎవ్వరూ కూడా సీరియస్ అయిన దాఖలాలు లేవు. కానీ మొదటి సారి సుమకు షాక్ ఇచ్చినట్టు అయింది. ఈ శనివారం క్యాష్ షోకు పెళ్లి సందడి టీం రాబోతోంది.

అలా మొదటి సారిగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షోలకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు విచ్చేశాడు. అక్కడ కూడా ఆయన పర్యవేక్షణలోనే షో నడిచినట్టు అయింది. ఆయన అలా పక్కన కూర్చున్నారు. ఆయన టీం క్యాష్ షోలో దుమ్ములేపింది. హీరో రోషన్, శ్రీలీల, గౌరీ రోనంకి, శ్రీధర్ శ్రీపాన ఇలా టీం మొత్తంతో సుమతో రచ్చ చేసింది. అయితే సుమకు ఎంట్రీలోనే షాక్ ఇచ్చాడు దర్శకేంద్రుడు. కేసు వేస్తాను అంటూ సుమను బెదిరించాడు.

దర్శకేంద్రుడు షోలో తన స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు ఆయన్ను సుమ ఇమిటేట్ చేసింది. ప్యాంట్ సరి చేసుకుంటున్నట్టుగా చూపించి.. మిమ్మల్ని చిరంజీవి గారు కాపీ కొట్టారు కదా? అని రాఘవేంద్ర రావు మీద జోకులు వేసింది. దీంతో హర్ట్ అయిన దర్శకుడు.. నన్ను ఎగతాళి చేస్తావా? నీ మీద కేసు వేస్తాను అని ఫైర్ అయ్యాడు. ఆ తరువాత సుమను హీరోయిన్‌గా పెట్టి.. నడుము మీద గుమ్మడి కాయ కొట్టాలనే ప్లాన్ ఉండేదని చెప్పడంతో సుమ షాక్ అయింది.

ఇక చివర్లో షో మొత్తం అన్యాయం, మోసం అంటూ మాలో ఒక్కరూ కూడా ఒక్క రూపాయి కూడా గెలుచుకోలేదు.. మేం అంత పనికి రాని వాళ్లమా? అంటూ దర్శకేంద్రుడు సీరియస్ అయినట్టు.. సుమ తెగ ఏడ్చేసినట్టు ప్రోమోను బాగానే కట్ చేసేశారు.