టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న కేఎల్ రాహుల్‌కు ఇంకా టెస్టు క్రికెట్ సరిపోయే నైపుణ్యం లేదని కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. వన్డే, టీ20ల్లో రాహుల్ మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ టెస్టు క్రికెట్‌లో రాటుదేలేలంటే సాధ్యమైనన్ని ఫస్ట్‌క్లాస్ గేమ్స్ ఆడాల్సి ఉందన్నాడు.
టెస్టు క్రికెట్‌లో అజింక్యా రహానే స్థానంలో రాహుల్‌ని తీసుకోవాలని అనుకుంటే అది కచ్చితంగా పొరపాటే అవుతుందన్నాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌కు సరిపోయే అన్ని టెక్నిక్స్ రహానేలో ఉన్నాయని మంజ్రేకర్ తెలిపాడు. ప్రత్యేకంగా టెస్టు ఫార్మాట్‌లో ఐదో స్థానంలో రహానేనే తీసుకోవాలన్నాడు. ఐదో స్థానంలో రాహుల్ మంచి ప్లేయరే కావొచ్చు.. కానీ రహానే ఉన్నప్పుడు ఆ ప్లేస్ కోసం ఇప్పట్లో వేరే ఒకర్ని తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు.
రాహుల్ చివరగా ఆడిన టెస్టులో విఫలమైన సంగతిని మంజ్రేకర్ గుర్తు చేశాడు. వన్డేలు, టీ20ల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన రాహుల్.. దాన్ని టెస్టుల్లో కొనసాగించలేకపోతున్నాడన్నాడు. రాహుల్ ఎక్కువ సంఖ్యలో ఫస్ట్‌క్లాస్ గేమ్స్ ఆడి భారీ స్కోర్లతో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ట్వీటర్‌లో తన ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంజ్రేకర్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు.
మయాంక్ అగర్వాల్ దేశవాళీ మ్యాచ్‌ల్లో ఎలా ఆడి జాతీయ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడో, అదే తరహాలో రాహుల్ కూడా దేశీయ క్రికెట్‌పై దృష్టి పెట్టాలన్నాడు. గత కొంతకాలంగా టెస్టు క్రికెట్‌లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ-మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తుండగా, పృథ్వీ షా ఆప్షనల్ ఓపెనర్‌గా ఉన్నాడన్నాడు. కాగా, భారత క్రికెట్ జట్టుకు వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా మంజ్రేకర్ పేర్కొన్నాడు. ధోని, కోహ్లి తరహా కెప్టెన్లు భారత్‌కు దొరికినప్పుడు వేర్వేరు కెప్టెన్ల ప్రస్తావన అవసరం లేదన్నాడు.