టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు స్వీకరణకు చివరి రోజున దరఖాస్తు చేసుకున్నాడు. హెడ్ కోచ్‌గా ద్రవిడ్ ఎంపిక దాదాపుగా ఖరారు అయిన నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ నామమాత్రంగా సాగింది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు దృవీకరించాయి. టీ20 ప్రపంచకప్-2021 అనంతరం ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుండడంతో బీసీసీఐ టీమిండియా కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
హెడ్ కోచ్ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలు అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీలో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ పదవులకు కూడా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. బ్యాటింగ్ కోచ్‌గా ప్రస్తుతం ఉన్న విక్రమ్ రాథోడ్ కొనసాగే అవకాశం ఉండగా.. బౌలింగ్ కోచ్ పదవి కోసం భారత మాజీ పేసర్ పరాస్ మాంబ్రే నిన్ననే అప్లై చేసుకున్నాడు. ద్రవిడ్ సహా మాంబ్రే పదవి కూడా దాదాపుగా ఖరారైనట్టేనని బీసీసీఐ వర్గాల సమాచారం. కాగా, ద్రవిడ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(NCA) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.