ఆ హీరోయిన్ పనితీరుకి రాహుల్ ఫిదా.

rahul-gandhi-appreciates-mp-ramya-work-in-politics

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మారడం అంటూ మొదలు అయితే కొద్ది కాలంలోనే ఎంత మార్పు వస్తుందో చెప్పేందుకు దేశ రాజకీయాలే ఓ పెద్ద ఉదాహరణ. ఓ 6 నెలల కిందట ఎక్కడ చూసినా ఒకటే అభిప్రాయం. కాంగ్రెస్ భావి సారధి రాహుల్ గాంధీ పప్పు, ప్రధాని నరేంద్ర మోడీ కి తిరుగు లేదన్న అభిప్రాయం గట్టిగా ఉండేది. రాహుల్ ని పార్టీ నుంచి బయటికి పంపాలని కొందరు కాంగ్రెస్ నేతలే డిమాండ్ చేశారు. ఈ 6 నెలల్లో బండ్లు ఓడలు అయ్యాయి. ఓడలు బండ్లు అయ్యాయి. పెద్ద నోట్ల రద్దు ప్రభావం తెలియడం, జీఎస్టీ పోటుకి జనం బెంబేలు ఎత్తడం ప్రధాని మోడీ ప్రభ మసకబారడం పెనువేగంతో జరిగిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ యువ నేత రాహుల్ పప్పు కాదు. మోడీ తన సొంత గడ్డ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ వ్యూహాలకి కంగారు పడుతున్నారు. ఇదంతా ఆరు నెలల్లో కనిపిస్తున్న మార్పు. ఈ మార్పు వెనుక వున్న ఓ మహిళ పనితీరుకు రాహుల్ ఇప్పటికే ఫిదా అయిపోయాడు.

Related image
రాహుల్ ని తన వర్కింగ్ స్టైల్ తో ఇంతగా ఆకట్టుకున్న మహిళ ఇంకెవరో కన్నడ హీరోయిన్ రమ్య. మాజీ ఎంపీ కూడా అయిన రమ్య కి ఆరు నెలల కిందట ఓ బాధ్యత అప్పగించారు రాహుల్. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగాన్ని ఆమె చేతిలో పెట్టారు. హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా కుమారుడు , రోహతక్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా ని తప్పించి మరీ రమ్య కి ఆ బాధ్యతలు అప్పగించారు. ఆమె ఆ బాధ్యతలు అందుకోడానికి కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి వెళ్లేసరికి అక్కడ ముగ్గురంటే ముగ్గురు ఉద్యోగులు ఉస్సురంటూ కనిపించారు. రమ్య వెంటవెంటనే అక్కడ పనిచేసే 20 మంది సిబ్బందిని ముందు ఆఫీస్ కి రప్పించారు. వారి ద్వారా అక్కడున్న సమస్యలు ఏమిటో తెలుసుకున్నారు. వాటిని అక్కడికక్కడే తీర్చేసారు. అక్కడి ఉద్యోగుల సంఖ్యని దాదాపు వందకి పెంచారు. వారిలో 85 శాతం మహిళలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు . ఓ పక్కా ప్లాన్ ప్రకారం సోషల్ మీడియాలో కాంగ్రెస్ అనుకూల ప్రచారం మొదలెట్టారు. మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ చేసిన పనులతో జనం ఎలా ఇబ్బందులు పడుతున్నారో చెప్పేందుకు సోషల్ మీడియా పోస్ట్ లని సమర్ధంగా వాడుకున్నారు.

ఒకప్పుడు రాహుల్ ని చేతకానివాడిగా చిత్రీకరించిన సోషల్ మీడియా వేదికపై ఇప్పుడు మోడీ వైఫల్యాలపై కుప్పలుతెప్పలుగా మెసేజెస్ వస్తున్నాయి. రావడమే కాదు సగటు భారతీయుడిని ఆలోచింపచేస్తున్నాయి. ఈ సోషల్ మీడియా లో వస్తున్న భిన్నమైన కోణాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీటికి జవాబు ఇవ్వడం ఇప్పుడు బీజేపీ కి తలకి మించిన పని అవుతోంది. 6 నెలల వ్యవధిలో సోషల్ మీడియా వేదికపై డిఫెన్స్ ఆడదానికి కూడా భయపడిన కాంగ్రెస్ ఇప్పుడు ఫుల్ ఆఫెన్స్ లో వుంది. ఆ దూకుడుని అడ్డుకోడానికి బీజేపీ ఇప్పుడు అదనపు సిబ్బంది, వ్యూహకర్తలు సాయం తీసుకోవాలి అనుకుంటోంది. మొత్తానికి ఓడిన చోటే తిరిగి గెలిస్తే ఆ మజానే వేరు. ఇప్పుడు ఆ విజయానందంలో వున్న రాహుల్ అండ్ కో రమ్య పనితీరుకు ఫిదా అవ్వడమే కాదు సార్వత్రిక ఎన్నికల నాటికి ఇంకొన్ని బాధ్యతలు ఆమెకి అప్పగించబోతున్నారు. హీరోయిన్ ఈమె ఏమి చేస్తుందిలే అనుకున్న కాంగ్రెస్ నేతలు చాలా మందికి రమ్య ప్రయాణం పెద్ద షాక్.