Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఎన్నికల ఫలితాలను తనదైన తీరులో విశ్లేషించారు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత వచ్చిన తొలి ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ… అందులోని సానుకూల కోణాన్ని చూపించి పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు యువరాజు. గుజరాత్ లో బీజేపీ గెలిచినట్టు కనిపిస్తున్నప్పటికీ నిజానికి నైతిక విజయం కాంగ్రెస్ దే అని రాహుల్ అభివర్ణించారు. మోడీ మోడల్ అనేది గుజరాత్ లో కేవలం ప్రచార స్టంట్ గానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ గొప్ప ఆర్థికసంస్కరణలుగా చెప్పుకునే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అంశాల ఊసు కూడా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోడీ ఎత్తలేకపోయారని విమర్శించారు.
ప్రధాని కోపం దేనికీ పనికిరాదని, మిమ్మల్ని ఓడించడానికి ప్రేమ చాలు అన్న సందేశం గుజరాత్ ఎన్నికలు ఇచ్చాయని వ్యాఖ్యానించారు. సొంత రాష్ట్రంలో మూడు దశాబ్దాల్లో బీజేపీ అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించడం ప్రధాని మోడీ విశ్వసనీయత ఎంతో తెలియజేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మోడీని ఎన్నో సమస్యలు చుట్టుముట్టనున్నాయని రాహుల్ జోస్యం చెప్పారు. నాలుగు నెలల క్రితం తాను గుజరాత్ పర్యటనకు వెళ్లే సమయంలో అందరూ కాంగ్రెస్ ను అవహేళన చేశారని, పదిస్థానాల్లో కూడా గెలవలేదన్నారని, కానీ తన కఠోరశ్రమతో గుజరాత్ లో కాంగ్రెస్ ను గర్వంగా నిలబెట్టానని రాహుల్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వల్ల బీజేపీ వెన్నులో వణుకు పుట్టిందన్నారు. గుజరాత్ ప్రజలు తనపై ఎంతో ప్రేమ చూపించారని, అవసరమైనప్పుడు రాష్ట్రానికి తన సేవలందిస్తానని రాహుల్ హామీఇచ్చారు.