Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటక బయలుదేరిన రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటం వెనుక కుట్ర దాగుందా ? ఆయనని చంపేందుకు ఎవరయినా ప్రయత్నించారా ? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ప్రైవేటు విమానంలో చోటు చేసుకున్న సాంకేతిక సమస్య వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా? అన్న డౌట్ ను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. విమానయాన రంగంలో సాంకేతిక లోపం ఏర్పడటం అత్యంత ప్రమాదకరమైన అంశమని ఈ వ్యవహారం మీద సందేహాలు ఉన్నాయి కాబట్టి పోలీసులకు కంప్లైంట్ అందించారు రాహుల్ టీం సభ్యుడయిన కౌశల్ విద్యార్థి, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా, ఈ మేరకు ఫిర్యాదును పోలీసులకు సమర్పించగా, ఎఫ్ఐఆర్ దాఖలైంది. ‘ప్రమాద సమయంలో వాతావరణం సాధారణంగా ఉంది. ఇలా ఖచ్ఛితంగా సాంకేతిక సమస్యే. ఘటనపై మాకు అనుమానాలు ఉన్నాయి. పైగా సమస్య ఏంటన్నది పైలెట్లు కూడా వివరించలేకపోతున్నారు’ అని కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గురువారం ఉదయం ఒక ప్రైవేటు ఛార్టెర్డ్ ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి కర్ణాటకకు బయలుదేరారు రాహుల్ గాంధీ. గురువారం ఉదయం 9.20 గంటలకు చార్టర్డ్ విమానంలో 10.45 గంటలకు సాంకేతిక సమస్య తలెత్తింది. తీవ్రమైన కుదుపులతో విమానం ఓ పక్కకు వాలిపోయింది. దాదాపు కూలిపోయే దశలో ఉందనగా పైలట్లు అతి కష్టం మీద విమానాన్ని ల్యాండ్ చేశారు. సాంకేతిక సమస్య తర్వాత దాదాపు 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానాన్ని సురక్షితంగా దింపేందుకు రెండు సార్లు విఫలయత్నం చేశారు. చివరికి మూడో ప్రయత్నంలో విమానాన్ని సురక్షితంగా దించారు. దాదాపు నలభై నిమిషాల పాటు తమ ప్రాణాలు గాల్లోనే ఉన్నట్లుగా విమానంలో ప్రయాణించిన వారు అభిప్రాయపడ్డారు. విమానంలో పైలట్లతో సహా అందరూ తీవ్ర ఆందోళనలకు గురవుతున్న వేళ… రాహుల్ మాత్రంప్రశాంతంగా ఉన్నారని.. ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయటం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆటో పైలట్ మోడ్ లో ఉండటంతోనే సమస్య తలెత్తినట్లుగా పౌర విమానయాన నియంత్రణ సంస్థ వెల్లడించింది. కాగా, రాహుల్ కు ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి ఆయన క్షేమ సమాచారాల గురించి ఆరా తీశారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఈ ఫిర్యాదు విషయమై పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కు పోలీసులు తెలియజేయనున్నట్టు తెలుస్తోంది.