రాహుల్‌ గాంధీ ని అరెస్ట్ చేసిన పోలీసులు

రాహుల్‌ గాంధీ ని అరెస్ట్ చేసిన పోలీసులు

థ్రస్‌ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు కాలినడకన వెళ్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను గురువారం గ్రేటర్‌ నోయిడాలోని యమున ఎక్స్‌ప్రెస్‌ వే పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని దగ్గర్లోని ఒక గెస్ట్‌హౌజ్‌కు తీసుకువెళ్లి, కాసేపైన తరువాత విడిచిపెట్టారు. హాథ్రస్‌కు శాంతియుతంగా, కాలినడకన వెళ్తున్న రాహుల్, ప్రియాంకను, పలువురు ఇతర నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారని కాంగ్రెస్‌ ప్రకటించింది.

అంతకుముందు, హాథ్రస్‌కు వెళ్లేందుకు బయల్దేరిన రాహుల్, ప్రియాంకల వాహన శ్రేణిని యూపీ పోలీసులు పరి చౌక్‌ వద్ద అడ్డుకున్నారు. దాంతో, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలి నడకన 150 కిమీల దూరంలోని హాథ్రస్‌కు వెళ్లాలని రాహుల్, ప్రియాంక నిర్ణయించారు. పాదయాత్రగా వెళ్తున్న రాహుల్‌ను పోలీసులు అడ్డుకుంటున్న క్రమంలో.. ఆయన కిందపడ్డారు. ‘మీరు హిందూ మత రక్షకులమని చెప్పుకుంటారు.

ఒక తండ్రి తన కూతురి చితికి నిప్పంటించనివ్వకూడదని, అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులను పాల్గొననివ్వకూడదని ఏ గ్రంథంలో రాసి ఉంది?’ అని యోగి ఆదిత్యనాథ్‌పై ప్రియాంకగాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకుల పర్యటన నేపథ్యంలో హాథ్రస్‌ జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌ విధించారు. జిల్లా సరిహద్దులను మూసేశారు. రాహుల్, ప్రియాంకలతో పోలీసులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన తీరును ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఖండించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందువల్లనే రాహుల్, ప్రియాంకలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని, దాంతో ఐపీసీ సెక్షన్‌ కింద వారిపై కేసు నమోదు చేశామని గౌతమబుద్ధ నగర్‌ కమిషనర్‌ లవ్‌ కుమార్‌ వెల్లడించారు.