ఈనెల 18న తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ..

Rahul Gandhi is coming to Telangana on 18th of this month..
Rahul Gandhi is coming to Telangana on 18th of this month..

తెలంగాణలో ఎలాగైనా కర్ణాటక ఫలితాలు రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇప్పుడు ఈ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడింది. ఇందుకోసం 119 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీని ద్వారా ఇప్పటివరకు ప్రకటించిన వ్యవసాయ డిక్లరేషన్, యువ డెక్లరేషన్, చేయూత పెన్షన్ పథకం, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, 6 హామీల గ్యారెంటీ కార్డు జనంలోకి తీసుకెళ్లనున్నారు.

రోజుకు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాలలో బస్సు యాత్ర చేపట్టేందుకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. కార్నర్ సమావేశాలు నిర్వహణకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గేలతోపాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. ఈ నెల 14, 15 తేదీలలో ప్రియాంక గాంధీ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.