రాహుల్- రావణ్ , ప్రియాంక – శూర్పణఖ…!

Rahul Gandhi Like Raavan Priyanka Is Suparnakha Up BJP MLA

ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఆమె మీద కాంగ్రెస్ పార్టీ మీదా బీజేపీ నేతలు చేస్తున్న వివాదాస్పద విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ప్రియాంకకు యూపీ తూర్పు కాంగ్రెస్ విభాగం బాధ్యతలు అప్పగించడంతో ఆమెపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలంటే అందాలు పోటీలు కాదంటూ ప్రియాంకను ఉద్దేశించి రెండు రోజుల కిందట బిహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోదీ చేసిన వ్యాఖ్యాలపై పెనుదుమారమే రేగగా అది చల్లారక ముందే యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రియాంకను శూర్పణఖతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మోడీని శ్రీరాముడుగా రాహుల్‌ను రావణాసురుడితో పోలుస్తూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఎస్సీ, ఎస్టీ చట్టం వివాదం కారణంగానే ఇటీవల జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించగలిగిందని ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ఓ రాజకీయ విధానం అంటూ ఏదీ లేదని, వచ్చే ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలవబోదని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలాంటిదని పేర్కొన్న్న ఆయన బీఎస్పీ అధినేత్రి మాయావతిని ట్రాన్స్ జెండర్‌ గా అభివర్ణిస్తూ తమ ఎమ్మెల్యే సాధనాసింగ్ చేసిన వ్యాఖ్యలను సైతం సురేంద్ర సింగ్ సమర్థించడం విశేషం. ఆత్మగౌరవం లేనివారిని ట్రాన్స్ జెండర్ అంటారని సమాజ్ వాదీ పార్టీతో జతకట్టడం ద్వారా తనకు ఆత్మగౌరవం లేదని మాయావతి నిరూపించుకున్నారని ఆయన లాజిక్ చెప్పుకొచ్చారు.