నూతన సాగు చట్టాలకు వ్యతిరేంగా దేశ రాజధానిలో రైతులు చేస్తోన్న దీక్షకు కేంద్రం తల వంచింది. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా ప్రకటించారు. కేంద్ర నిర్ణయంపై అన్నదాతలు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సాగు చట్టాలపై గతంలో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ప్రస్తుతం మరోసారి వైరలవుతోంది.
2021, జనవరి 14న రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం తప్పక వెనక్కి తీసుకుంటుంది’’ అన్నారు. ఇక మోదీ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఈ వీడియో మరోసారి వైరలవుతోంది.
ఇక సాగు చట్టాల రద్దుపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘అన్నదాతలు తమ స్యతాగ్రహంతో కేంద్రం అహంకారాన్ని తలదించారు. అన్యాయంపై సాధించిన ఈ విజయానికి రైతులందరికీ అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు.
‘‘సాగు చట్టాల రద్దుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ ప్రకాశ్ దివాస్ నాడు శుభవార్త విన్నాం. రైతులకు వ్యతిరేకంగా ఉన్న సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. ఈ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలకు నేడు తగిన ఫలితం లభించింది. దేశ రైతులకు సెల్యూట్’’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.