క‌ర్నాట‌క బీజేపీ నేత‌ల అవినీతి గురించి పేప‌ర్ చూస్తూ అయినా మాట్లాడండి…

Rahul Gandhi Satirical Comments On Modi About BJP Leaders Corruption

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్ర‌ధానిని  ఎద్దేవా చేసిన రాహుల్

క‌ర్నాట‌క‌లో మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. రాష్ట్రం బాగుప‌డాలంటే…కాంగ్రెస్ ను ఓడించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పిలుపునిచ్చారు. తుమ‌కూరులో నిర్వ‌హించిన‌ బహిరంగ‌స‌భ‌లో ప్ర‌సంగించిన మోడీ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి అవినీతి, నల్ల‌ధ‌నంపై ఉన్న ఆస‌క్తి రాష్ట్రాభివృద్ధిపై లేద‌ని ఆరోపించారు. హేమ‌వ‌తి నది ప్ర‌వ‌హిస్తున్న‌ప్ప‌టికీ…తుమ‌కూరు వాసుల‌కు తాగునీటి క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ని, తాగునీటి స‌రఫ‌రాలో క‌ర్నాట‌క ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌యింద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్, జేడీఎస్ లు రెండూ తోడుదొంగ‌ల‌ని, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు ఆ రెండు పార్టీలు చూస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు గుప్పించుకున్న‌ప్ప‌టికీ…ఆ రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయ‌ని ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి వ‌స్తేనే క‌ర్నాట‌క‌లో అభివృద్ధి సాధ్యమ‌వుతుంద‌ని, త‌మ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాల‌ని కోరారు. అటు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా ప్ర‌చార జోరు పెంచారు. అబ‌ద్ధాలు చెప్ప‌డం కాంగ్రెస్ నైజ‌మ‌ని ప్ర‌ధాని చేసిన ఆరోప‌ణ‌ల‌పై రాహుల్ ట్విట్ట‌ర్ లో స్పందించారు. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్ సాధించిన విజ‌యాల‌ను పేప‌ర్ చూడ‌కుండా…ఐదు నిమిషాలు హిందీలో గానీ, ఇంగ్లీష్ లో గానీ, త‌న త‌ల్లి మాతృభాష ఇటాలియ‌న్ లో గానీ మాట్లాడగ‌ల‌రా…అని ప్ర‌ధాని విసిరిన స‌వాల్ కు రాహుల్ ప్రతి స‌వాల్ విసిరారు. క‌ర్నాట‌క బీజేపీ నేత‌ల అవినీతి గురంచి పేప‌ర్ చూస్తూ అయినా  మాట్లాడాల‌ని ప్ర‌ధానిని ఎద్దేవా చేశారు. 
మోడీ ఎక్కువ‌గా మాట్లాడ‌తార‌నీ…అందులో ఏదీ చేత‌ల్లో చూప‌రని ఆరోపిస్తూ ఓ వీడియోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. డియ‌ర్….మోడీజీ….మీరు చాలా బాగా మాట్లాడ‌తారు. ఇక్క‌డ స‌మ‌స్య ఏంటంటే…మీ మాట‌ల‌కు, చేసే ప‌నుల‌కు అస‌లు పొంతన ఉండ‌దు. మీ మాట‌ల్లో ఉన్న నిజాయితీ క‌ర్నాట‌క బీజేపీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో లేదు.
క‌ర్నాట‌క మోస్ట్ వాంటెడ్ ఎపిసోడ్ లా మీ మాట‌లు ఉన్నాయి. అవినీతిప‌రులైన గాలిబ్ర‌ద‌ర్స్ కు అత్యంత స‌న్నిహితులైన ఎనిమిది మందికి టికెట్లు ఇచ్చారు.. య‌డ్యూరప్ప‌పై చీటింగ్, అవినీతి, ఫోర్జ‌రీ వంటి 23 కేసులున్నాయి..ఇవి  రాష్ట్రానికి సీఎం కావాల్సిన వ్య‌క్తికి ఉండాల్సిన ల‌క్ష‌ణాలేనా..? బీజేపీలోని 11 మంది అగ్ర‌నేత‌ల అవినీతి గురించి ఎప్పుడు మాట్లాడ‌తారు? బీజేపీ నేత‌లపై క్రిమిన‌ల్ కేసులు, అవినీతి గురించి మీరు నోరు విప్పుతార‌ని ఆశిస్తున్నాను. మీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటాను. కావాలంటే మీరు చేతిలో పేప‌ర్ ప‌ట్టుకునే స‌మాధానం చెప్పొచ్చు అని రాహుల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధానికి స‌వాల్ విసిరారు.