Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లోని డోక్లాం ప్రతిష్టంభన ముగిసిపోయి నెలలు గడుస్తున్నా… చైనా ఆ వివాదాన్ని కెలుకుతూనే ఉంటోంది. తాజాగా మరోసారి డోక్లాం సమస్యపై చైనా భారత్ ను రెచ్చగొట్టే ప్రకటన చేసింది. డోక్లాం అంశం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని చైనా మళ్లీ వ్యాఖ్యానించింది. చైనా ప్రకటనపై భారత్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. చైనా వ్యాఖ్యలను తిప్పికొట్టకుండా ప్రధాని మౌనంగా ఉండడంపై రాహుల్ పరోక్ష విమర్శలు గుప్పించారు. డోక్లామ్ విషయంలో భారత ప్రధాని మౌనంగా ఉన్నారని, బహుశా పెద్ద ప్లాన్ తోనే ఉన్నారేమోనని చురకలంటించారు.
గత వారం ట్విట్టర్ లో ఓ పోల్ నిర్వహించారని, అందులో 63 శాతం మోడీ తన హగ్ ప్లోమసీ ఉపయోగించి కూడా డోక్లామ్ అంశానికి పరిష్కారం చూపలేకపోతున్నారని ఓటు వేశారని రాహుల్ చెప్పారు. అయితే ఆ 63శాతం నెటిజన్లు అనుకున్నది చాలా తప్పని, దేశంకోసం మన 56 ఇంచుల ఛాతీ అనగా మోడీ దగ్గర ఓ పెద్ద ఉపాయమే ఉంటుందని భావిస్తున్నానని రాహుల్ ఎద్దేవా చేశారు. ఇతర దేశాధినేతలను కౌగిలించుకుని పలకరించే మోడీ విధానానికి రాహుల్ హగ్ ప్లోమసీ అని పేరు పెట్టారు. మోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై హగ్ ప్లోమసీ, 56 ఇంచుల ఛాతీ అంటూ రాహుల్ తరచుగా… సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తుంటారు.