కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మానస సరోవర యాత్ర చేపట్టనున్నారని తెలుస్తోంది. ఈ నెల చివరిలోపు ఆయన యాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తనని శివ భక్తుడిగా ప్రకటించుకున్న రాహుల్ శివ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర చేపట్టనుండటం ఇప్పుడు కాషాయ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. బీజేపీ హిందుత్వ ఎజెండాకు చెక్ పెట్టే ఉద్దేశంతో గుజరాత్, కర్ణాటక ఎన్నికల్లో కనిపించిన గుళ్లన్నీ తిరిగిన రాహుల్ ఇప్పుడీ యాత్రతో మరోసారి బీజేపీకి ఝలక్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో తాను ఈ యాత్ర చేస్తానని రాహుల్ ప్రకటించారు.
కర్ణాటక ఎన్నికల సమయంలో తనకు తృటిలో విమాన ప్రమాదం తప్పిందని, అప్పుడే ఈ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ చెప్పారు. ఆ ఎన్నికల సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న విమానం.. కొన్ని నిమిషాల పాటు రాడార్‌కు చిక్కకుండా పోయింది. అయితే పెద్ద ప్రమాదం తప్పడంతో అప్పుడే తాను ఆ పరమశివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఈ యాత్ర కోసం రాహుల్‌గాంధీ దరఖాస్తు చేసుకోలేదని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్ర చైనా గుండా సాగుతుండటం వల్ల ముందుగానే యాత్రికులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా అనుమతి తీసుకోవడం లేదా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా యాత్ర చేసే అవకాశాలు రాహుల్ ముందు ఉన్నాయి.