రాహుల్ మిల్క్ ప్ర‌చారం ప్రారంభించిన అభిమాని

rahul gorakhpur fan started milk enterprises

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాజ‌కీయ నాయ‌కుల‌కు అభిమానులు ఎక్కువ‌. అయితే సాధారణంగా నేత‌ల‌ను అభిమానించే వారిలో ఎక్కువ‌మంది అనుచ‌రులుగా మారి…త‌మ నాయ‌కుడి వెంట న‌డుస్తారు. మ‌రికొంద‌రు తమ నేత‌కు చెందిన పార్టీకి ఓటు వేయ‌డం, వారు చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు మ‌ద్ద‌తివ్వ‌డం వంటివాటికి పరిమిత‌మ‌వుతారు. అయితే ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు చెందిన ఓ అభిమాని ఇలాంటివాటితో స‌రిపెట్ట‌లేదు. తమ నాయ‌కుడికి మ‌రింత ప్ర‌చారం క‌ల్పించ‌డానికి ఆయ‌న వినూత్న ప‌ద్ధ‌తులు అవ‌లంబిస్తూ అంద‌రిదృష్టినీ ఆక‌ర్షిస్తున్నారు. ఇంత‌కీ ఆ ప్రత్యేక వ్య‌క్తి ఎవ‌రి అభిమానో తెలుసా…కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిమాని. గోర‌ఖ్ పూర్ కు చెందిన అన్వ‌ర్ హుస్సేన్ రాహుల్ కు వీరాభిమాని. కాంగ్రెస్ నేత కూడా అయిన అన్వ‌ర్ గ‌తంలో రాహుల్ పార్టీ అధ్య‌క్షుడు కావాల‌ని కోరుతూ ర‌క్తంతో లేఖ‌లు రాసే ప్ర‌చారం చేశారు. ఇప్పుడు ఆ క‌ల నెర‌వేర‌డంతో ఆయ‌న ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. ఇక ఇప్పుడు మ‌రో కొత్త బాధ్య‌త‌ను భుజాన‌వేసుకున్నారు అన్వ‌ర్.
రాహుల్ గాంధీ గురించి ప్ర‌జ‌ల్లో మ‌రింత ప్ర‌చారం చేయ‌డంతో పాటు యువ‌తీ యువ‌కులు కాంగ్రెస్ లో చేరే విధంగా ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందుకోసం వినూత్న ప్ర‌చారం మొద‌లుపెట్టారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీ చేప‌ట్టిన ఛాయ్ పే చ‌ర్చా బాగా ప్రాముఖ్య‌త పొందడంతో ఆ త‌ర‌హాలోనే అన్వ‌ర్ రాహుల్ మిల్క్ ప్ర‌చారాన్ని ప్రారంభించారు. రాహుల్ మిల్క్, రాహుల్ గాంధీ హెర్బ‌ల్ టీ పేరుతో వివిధ ప్రాంతాల్లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలోనూ అన్వ‌ర్ ఇలాంటి వినూత్న ప్ర‌చారాలు చేశారు. యూపీ ఎన్నిక‌ల సమ‌యంలో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాద‌వ్ క‌లిసిన‌ప్పుడు క‌ర‌న్, అర్జున్ కీ జోడీ అంటూ ప్ర‌చారం చేశారు. అలాగే కాంగ్రెస్ కు ఓటేయాల‌ని కోరుతూ రాహుల్ గులాబీలు కూడా పంచిపెట్టారు. ఉల్లిపాయ‌ ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిన స‌మ‌యంలో రాహుల్ ఉల్లిపాయ‌లు అంటూ కిలో రూ.5కే ఇచ్చారు. ఇలా త‌నకు తోచిన రీతిలో రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తుగా అన్వ‌ర్ చేస్తున్న వినూత్న ప్ర‌చారాన్ని పార్టీ కూడా మెచ్చుకుంది.