బిగ్‌బాస్ ప్రవేశపెట్టిన నామినేషన్ ప్రక్రియ ఆద్యంతం ఉత్కంఠకరంగా సాగింది. టికెట్ టు ఫినాలే రేసులో గెలుపు కోసం ఇంటి సభ్యులు రెచ్చిపోయారు. ఇక పూల టాస్క్‌లో అలీ రెజా, బాబా భాస్కర్ల ఫైట్ సినిమాల్లోని పోరాట ఘట్టాలకు ఏమాత్రం తీసిపోనిదిగా ఉంది. టాస్క్‌లో భాగంగా.. అలీ బాబాను తోసెస్తూ మట్టి పాత్ర దరిదాపుల్లోకి కూడా రానీకుండా విశ్వప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిని ఒకరు తోసుకుంటూ బల ప్రదర్శన చూపించారు.హింసకు తావలేదంటూ హెచ్చరికలు జారీ చేశాడు. అయినప్పటికీ వినిపించుకోని అలీ.. బాబాను తలతో గుద్దుతూ కిందపడేశాడు. దీంతో బిగ్‌బాస్ ఈ టాస్క్‌ను రద్దు చూస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హింసకు పాల్పడ్డ అలీని టికెట్ టు ఫినాలే రేసుకు అనర్హుడిగా ప్రకటించాడు. దీంతో వీరోచితంగా పోరాడిన అలీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయింది. అప్పటివరకూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన అలీకి బిగ్ షాక్ తగిలినట్టయింది.
అనంతరం బెల్ మోగించిన రాహుల్, శ్రీముఖి తలపడ్డారు. వారికిచ్చిన డామినోస్ లను వరుస క్రమంలో నిలబెట్టాల్సి ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు. ఈ టాస్క్‌లో రాహుల్‌కు అలీ సహాయం చేయగా శ్రీముఖి ఒంటరి పోరాటం చేసింది. కానీ వీరి ఆటకు గాలి ఆటంకం కలిగించడంతో శ్రీముఖి పెట్టిన కార్డ్స్ అన్నీ పడిపోగా రాహుల్‌వి మాత్రం నిటారుగా ఉండటంతో అతను గెలిచాడు. ఓటమితో శ్రీముఖి తీవ్ర నిరాశ చెందినట్టు కనిపించింది. అనంతరం బజర్ మోగినపుడు గంట కొట్టిన శ్రీముఖి, శివజ్యోతిలకు క్యూబ్స్‌తో పిరమిడ్లు నిర్మించాల్సిన టాస్క్ ఇవ్వగా ఇందులో రాములమ్మ విజయం సాధించింది.
కాగా అప్పటికే ఆధిక్యంలో ఉన్న రాహుల్‌ను ఇంటి సభ్యులెవరూ అందుకోలేకపోయారు. నామినేషన్ టాస్క్‌లో అలీ, వరుణ్ 0, శివజ్యోతి, శ్రీముఖి.. 10, బాబా భాస్కర్.. 20, రాహుల్.. 40 శాతం బ్యాటరీని సాధించారు. అధిక బ్యాటరీతో ముందంజలో ఉన్నరాహుల్ నామినేషన్ నుంచి సేఫ్ అవడంతోపాటు ‘టికెట్ టు ఫినాలే’ గెలుచుకున్నాడు. మిగిలిన అయిదుగురు ఇంటి సభ్యులు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. కాగా ఈ సీజన్లో మొదటి ఫైనలిస్టు అయిన రాహల్ కోసం బిగ్‌బాస్ చాక్లెట్లు పంపించి పండగ చేసుకోమన్నాడు.