దేశ వ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ చేయటం వలన వేలకొద్ది రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆస్పత్రుల కొరత పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు ఖాళీగా ఉన్న రైళ్లను కోరోనా బాధితుల కోసం ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది.
దీని కోసం కొన్ని రైళ్లలోని బోగీలను రైల్వే శాఖ ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో వాటిని కరోనా బాధితుల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఒక్కో బోగిలో 9 మందిని ఉంచేలా ఏర్పాట్లు చేశారు. బోగీల్లో ఉన్న బెర్త్‌ల్లో ఒకరికొకరు ఇబ్బంది పడకుండా.. 9 మంది సులభంగా, సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ బోగీల్లో ఉండేవారికి ఆయా రైళ్లలోనే ఉండే పాంట్రీ కార్లలో భోజనం తయారు చేసే ఏర్పాట్లు చేశారు. పాంట్రీ కార్లు లేని రైళ్లలో భోజనం బయటినుంచి తెచ్చి ఇస్తారు. మొత్తానికి ఖాళీగా ఉన్న బోగీలు క్వారంటైన్‌కు ఉపయోగించుకోవడం వల్ల ఒకే సమయంలో ఎక్కువమంది ఐసోలేషన్‌లో ఉండే ఏర్పాట్లు కల్పించినట్టయింది.