భారత జట్టు మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనాకు ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా ధోని అంటే అంటే ఎంతో గౌరవమని పలు సందర్భాల్లో చెప్పడమే గాక చేతల్లోను చూపించాడు రైనా. తాజాగా ఈ చిన్న తలా ఓ స్పోర్ట్స్ చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో మరో సారి వారి బంధానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం నుంచి, చైన్నై టీంకు పలు టైటిళ్లు గెలుచుకోవడం వరకు, రైనా, ధోనిలు కలిసి చాలా కాలమే ప్రయాణించారు.
ఇక పలు సందర్భాల్లో మ్యాచ్ విజయాల్లో ఈ ద్వయం కీలక పాత్ర పోషించారు కూడా. సురేష్ రైనా మాట్లాడుతూ.. మేం భారత్, చెన్నై తరపున ఎన్నో మ్యాచ్‌లు కలిసి ఆడాం. ఆటగాడికి ధోని అంటే నాకు ఎంతో గౌరవం ఉంది, అలానే వ్యక్తిగతంగా అతనంటే నాకిష్టం కూడా. నేను అతని నుంచి చాలా నేర్చుకున్నా. ధోనిని నా సహచరుడిలా కాకుండా సోదరుడిలా భావించే వాడినని తెలిపాడు రైనా. ఈ ఏడాది ధోని కోసం ఐపీఎల్ టైటిల్ గెలవాలనుకుంటున్నామని చెప్పాడు.
గత సీజన్ వైఫల్యాలను పునరావృతం కాకుండా రాబోయే ఐపీఎల్ సీజన్లో మా జట్టు మంచి ప్రదర్శనే కనబరుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. మా జట్టుకు ప్రధాన బలంగా చెప్పుకోదగిన వాటిలో ధోని కెప్టెన్సీ ఒకటని చెప్పుకొచ్చాడు. టీంలో మోయిన్ ఆలీ , సామ్ కరన్, బ్రావో లాంటి ప్లేయర్లు గతంలో యూఏఈ లో ఆడినందు వల్ల వారి అనుభవం పనికొస్తుందని అని చెప్పాడు. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ సీజన్లో చెన్నై పేలవ ప్రదర్శన కనబరిచిన తిరిగి ఈ ఏడాది తర్వాత తిరిగి బౌన్స్ అయిన సంగతి తెలిసిందే.