తెలంగాణలో చలి తగ్గుముఖం పడుతోంది. ఉష్ణోగ్రతల్లో కొద్దికొద్దిగా పెరుగుదల నమోదవుతోంది. అయితే వర్షాలు మాత్రం తెలంగాణను విడవటం లేదు. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మూడ్రోజుల పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా తెలిపింది.
వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం నుంచి మంగళవారం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది..
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురిసిన వానలతో పంటలకు భారీ నష్టమే జరిగింది.. ఈక్రమంలోనే రాష్ట్రంలో మరోసారి వర్షాలు తప్పవని వాతావరణ కేంద్రం హెచ్చరించింది..