తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

నైరుతి రుతుపవనాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

శుక్రవారం తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శని, ఆది, సోమవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో ఓ మాదిరి వానలు పడతాయని వివరించింది.

ఇక రాష్ట్రంలో గురువారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 22.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.