అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా లీలలు.. అక్రమాలు ఒక్కోటి బయట పడుతున్నాయి. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ముంబై పోలీసులకు రాజ్‌కుంద్రా భారీగా లంచం ఇచ్చాడని తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు పోలీసులకు ఏకంగా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యశ్ ఠాకూర్ పోలీసులకు పంపిన ఓ మెయిల్లో ఆరోపించారు.
హాట్ హిట్ యాప్ వేదికగా రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా రాజ్ కుంద్రా మాదిరి మీరు కూడా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మార్చిలోని ఏసీబీకి పంపిన ఈమెయిల్లో తెలిపారు. తాజాగా ఈమెయిల్‌ను ఏసీబీ పోలీస్ కమిషనర్‌కు పంపింది. అయితే ఈ విషయంపై ముంబై పోలీసులు స్పందించడం లేదు.
ఈ ఆరోపణలతోనే అంధేరిలోని రాజ్‌కుంద్రా కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అమెరికాకు చెందిన ఫ్లిజ్ మూవీస్ సంస్థకు సీఈఓగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవ ఏసీబీకి ఈమెయిల్ చేశారు. ఈ సంవత్సరం మార్చిలో ఏసీబీ ముంబైలోని సంస్త కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. రూ.4.5 కోట్లు ఉన్న రెండు బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. అయితే ఇదే కేసులో అప్పట్లో రాజ్‌కుంద్రా అరెస్ట్ కాకుండా రూ.25 లక్షలు ఇచ్చారని, మీరు కూడా అంతే మొత్తం ఇస్తే అరెస్ట్ చేయమని ఓ పోలీస్ రాయబారం చేసినట్లు ఈమెయిల్లో అరవింద్ తెలిపారు. మరిన్ని విషయాలపై సుదీర్ఘ లేఖ ఈమెయిల్ ద్వారా పంపారు. వాటి వివరాలు బయటకు రాలేదు.