Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : రవి తేజ, మెహ్రీన్, రాధిక, సంపత్ రాజు, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్
నిర్మాత : దిల్ రాజు
దర్శకత్వం : అనిల్ రావిపూడి
మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ : మోహన్ కృష్ణ
ఎడిటర్ : తమ్మిరాజు
మాస్ మహారాజా రవితేజ రెండేళ్ల తర్వాత మళ్లీ వెండి తెర మీద కనిపిస్తున్న సినిమా రాజా ది గ్రేట్. దిల్ రాజు ఆయనతో 12 ఏళ్ల తర్వాత తీసిన సినిమా. ఇక మొదటి సినిమానే రవితేజ తో తీయాల్సి జస్ట్ మిస్ అయిపోయిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ఆయనతో తీస్తున్న సినిమా రాజా ది గ్రేట్. ఇన్ని కాంబినేషన్ హైలైట్స్ కన్నా సినిమాలో హీరో అంధుడు అన్న విషయమే అన్నిటికన్నా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓ కమర్షియల్ హీరో అంధుడి పాత్రని ఒప్పుకోవడం ఓ ఎత్తు అయితే ఎక్కడా ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఆ సినిమా చేయడం ఇంకో ఎత్తు. ఆ ఛాలెంజ్ ని ఈ సినిమా ఎంతవరకు నెరవేర్చిందో చూద్దాం.
కథ…
కధగా చెప్పుకుంటే రాజా ది గ్రేట్ చాలా సింపుల్ స్టోరీ. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న తల్లి మాట విని ఓ యువకుడు విలన్ బారి నుంచి ఓ అమ్మాయిని కాపాడడం. ఈ క్రమంలో ఆ యువకుడిని అమ్మాయి ప్రేమించడం. చివరకు అన్ని సినిమాల్లో లాగానే విలన్ మీద హీరో గెలుస్తాడు. ఇంత కమర్షియల్ స్టోరీ లో హీరో అంధుడు అన్నదే కొత్త పాయింట్.
విశ్లేషణ …
ఏదైనా శారీరక వైకల్యం ఉన్నవారిలో కొన్ని అదనపు శక్తులు ఉండటం అందరికీ తెలుసు. గుడ్డివాళ్ళు చాలా మంది స్పర్శతో చేతిలో ఏ కరెన్సీ నోట్ వుందో చెప్పేస్తారు. ఇంటిలో ఎక్కడ ఏది ఉంటుందో చెప్పేస్తారు. ఎక్కడ నుంచి ఎన్ని అడుగులు వేస్తే ఎక్కడికి వెళతామో చెప్పేస్తారు. ఇలాంటి ఓ యువకుడికి అమోఘమైన తెలివితేటలు ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుంచి పుట్టిన ఈ కధకి కొన్ని పాత సినిమాలు ప్రేరణగా నిలిచాయి. అప్పుడెప్పుడో 25 ఏళ్ల కిందట మళయాళ హీరో మోహన్ లాల్ హీరోగా వచ్చిన యోధ సినిమా, ఆ మధ్య ప్రకాష్ కోవెలమూడి తీసిన అనగనగా ఓ ధీరుడు లాంటి సినిమాల ప్రభావం కొంత అనిపించినా జానర్ మారడంతో రాజా ది గ్రేట్ కి పూర్తిగా కమర్షియల్ లుక్ వచ్చింది. ఇక కథానాయకుడికి తెలివితేటలకు సంబంధించి అల్లుకున్న సీన్స్, అతనికి వున్న అదనపు శక్తుల్ని హైలైట్ చేసే సీన్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. అయితే కొన్ని సీన్స్ కథ లో గాకుండా తెచ్చిపెట్టినట్టు అనిపించినా వాటికి వున్న స్కోప్ రీత్యా పెద్దగా ఇబ్బంది అనిపించదు. ఇక ఈ సినిమాకి వినోదం, ఫైట్స్ రెండు రెండు కళ్ళు.
ఓ అంధుడి పాత్రలో ఇవన్నీ చూపించడం అంత తేలిక కాదు. అయితే రవితేజ ఎక్కడా ఓ లోపం లేకుండా చూసాడు. పర్ఫెక్ట్ గా చేసాడు. హీరో పాత్ర అంధుడు అయినప్పటికీ అతని శక్తియుక్తులు గురించి చెబుతూ ఎక్కడా జాలి గాకుండా ఆసక్తి రేకెత్తించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం వల్ల రవితేజ బాడీ లాంగ్వేజ్ లో ఈజ్ సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమా గురించి ఏమి చెప్పాలి అనుకున్నా ముందుగా రవితేజ,రాధిక, శ్రీనివాసరెడ్డి , అలీ పాత్రలతో పాటు సినిమాలో భాగం అయిపోయిన కామెడీ, ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
రామ్ లక్ష్మణ్ ల అన్న కొడుకు కంపోజ్ చేసిన ఫైట్స్ మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ చాలా బాగుంది. ఇక సాయి కార్తీక్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి దర్శకుడిగా , హీరోగా రవితేజ ఇంకో మెట్టు ఎక్కినట్టే.
ప్లస్ పాయింట్స్ …
రవితేజ నటన
కామెడీ,ఫైట్స్
దర్శకత్వం .
మైనస్ పాయింట్స్ ..
హీరో ఎలేవేషన్ కోసం కొన్ని అనవసర సన్నివేశాలు.
హీరో అంధుడు అన్న పాయింట్ పట్టించుకోని యాక్షన్ ఎపిసోడ్స్.
తెలుగు బులెట్ పంచ్ లైన్… “రాజా ది గ్రేట్ ” అని ముందే ఒప్పేసుకుంటే అంతా ఓకే.
తెలుగు బులెట్ రేటింగ్… 3 .25 /5 .
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review.
Kill Piracy And Watch Movie in Theaters