తెలంగాణా సీఎం కేసీఆర్ విడుదల చేసిన జాబితా ఆ పార్టీ ఎన్నికలు సన్నద్ధం అవడం కంటే వారి కొంప ముంచే పరిస్థితులే ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో అసంతృప్త నేతలు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా ఈసారి కూడా తాటికొండ రాజయ్యకు టికెట్ కేటాయిస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆయన మూడు సార్లు ఆ నియోజకవర్గం నుండే గెలుపొందారు. క్రితం సారి ఎన్నికల్లో ఆయన గెలవగానే అయన అడక్కుండానే ఆయనకి కీలకమైన వైద్య మంత్రుత్వ శాఖ అలాగే డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. అయితే అప్పుడే ఆయన మీద పలు ఆరోపణలు రావడంతో ఆయన్ను కేసీఆర్ మంత్రి వర్గం నుండి తప్పించారు. అయితే ఆయన మంత్రి వర్గం నుండి బయటకు వచ్చినా కేసీఆర్ కు విధేయుడిగా ఉంటూ వచ్చారు.
ఈ నేపధ్యంలోనే తాజా లిస్టు లో ఆయన పేరు కూడా ఉంది. అయితే ఆయనకు మరలా సీటు కేటాయించడం పట్ల డిప్యూటి సీఎం కడియం శ్రీహరి వర్గీయులు, అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో జనగామ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. రాజయ్యకు టికెట్ ఇవ్వడంపై కడియం శ్రీహరిని టీఆర్ఎస్ కార్యకర్తలు కలిశారు. రాజయ్యకు మద్దతివ్వమని కార్యకర్తలు తెగేసి చెప్పారు. కడియం శ్రీహరి కూతురికి టికెట్ వస్తుందని కార్యకర్తలు, నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ టికెట్ రాకపోవడంతో రహస్య సమావేశాలు జరుపుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో ఒక మహిళతో సరసంగా మాట్లాడుతున్న ఆడియో టేప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆడియో టేప్ పాతదే అయినా ఎన్నికల సమయంలో దానిని సర్క్య్యులేట్ చేస్తే ఆయన గౌరవాన్ని దెబ్బ తీయచ్చు అని ప్రత్యర్ధులు ఈ విధంగా వైరల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అది కడియం వర్గం పనే నని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరుణంలో ఇలా ఆడియో టేప్ లు బయటపడటం గులాబీ పార్టీకి తీరని నష్టమనే చెప్పాలి.