సర్వం తాళమయం టీజర్: ఈ హీరో తెలుగులో మంచి హిట్ కొట్టినట్టే

సర్వం తాళమయం టీజర్: ఈ హీరో తెలుగులో మంచి హిట్ కొట్టినట్టే

తమిళంలో సంగీతదర్శకుడిగా పెద్ద పెద్ద హీరోలకి హిట్టు ఆల్బమ్స్ ని ఇచ్చిన జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా టర్న్ తీసుకొని కూడా హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ, మంచి ఫేమ్ సంపాదించాడు. తెలుగులో కూడా ఉల్లాసంగా…ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట సినిమాలకి అద్భుతమైన పాటలని ఇచ్చి, సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తాను హీరోగా నటించిన సినిమాలు తెలుగులో ఆలస్యంగా విడుదల అయ్యేసరికి, సరైన ప్రమోషన్లు లేక తెలుగు ప్రేక్షకులకి చేరువకాలేదు. ఈమధ్యే విడుదలైన ఝాన్సీ సినిమాలో తన నటన తో ఆకట్టుకున్న జి.వి. ప్రకాష్ కుమార్ తమిళంలో 100% కాదల్ అంటూ తెలుగు సినిమా 100% లవ్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అర్జున్ రెడ్డి సినిమా హీరోయిన్ షాలిని పాండే తమిళంలోకి అడుగుపెట్టబోతుంది.

ఇదికాకుండా, జి.వి. ప్రకాష్ కుమార్ నటిస్తున్న సంగీత ప్రధాన చిత్రం ‘సర్వం తలమయం’ ఇప్పుడు అంతటా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు తెలుగులో రాజమౌళి విడుదల చేశారు. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నది రాజీవ్ మీనన్. స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అయినా రాజీవ్ మీనన్ డైరెక్టర్ గా మెరుపు కలలు, ప్రియురాలు పిలిచింది వంటి సినిమాలకి దర్శకత్వం వహించాడు. తాను డైరెక్ట్ చేస్తున్న మూడవ చిత్రమే ఈ సర్వం తాళమయం. ఈ సినిమాకి సంగీతం ఏ. ఆర్. రెహ్మాన్ అందిస్తున్నాడు. టీజర్ లో జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతంని ఇష్టపడేవాడిగా, సంగీతం తప్ప దేనితో ఇమడలేని కుర్రాడిగా బాగా నటించాడు. మళయాళ నటి అపర్ణ బాలమురళి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ 28 న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల అవ్వబోతుంది.