Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రజనీకాంత్ ని ఓ దేవుడిలా చూసే ఫాన్స్ తమిళనాడులో ఎంతోమంది వున్నారు. కానీ పదేళ్లుగా ఆయన రాజకీయం గురించి ఓ అడుగు ముందుకు ఓ అడుగు వెనక్కి వేస్తున్నారు. ఇక జయ మరణం తర్వాత నిండా రాజకీయాలే మాట్లాడుతున్న కమల్ కూడా కొత్త పార్టీ ఏర్పాటు అన్న విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. వాళ్లద్దరికీ ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ విశాల్ కి లేదు. వాళ్లకు ఉన్నంత వయసు , అనుభవం లేదు. రజని లాగానే విశాల్ తమిళుడు కాదు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన రెడ్డి. ఇన్ని విషయాల్లో ఆ ఇద్దరి కన్నా వెనుకబడి వున్న విశాల్ ఇప్పుడు నేరుగా జయ మరణంతో ఖాళీ అవుతున్న ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో నిలబడుతున్నారు. ఈ పరిణామం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఎన్నికతో పట్టు నిలుపుకోవాలని సీఎం పళనిస్వామి, శశికళ వర్గానికి చెందిన దినకరన్, డీఎంకే , బీజేపీ ఇలా రాజకీయ దిగ్గజాలన్నీ తలో వైపున అస్త్రశస్త్రాలతో నిలబడినా లెక్కచేయకుండా విశాల్ రంగంలోకి దిగడం ఆయన ధైర్యానికి ప్రతీక. ఆ ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది? నిజాయితీ, సేవాభావం నుంచి వచ్చింది.
ఏది చేసినా లెక్కలు వేసుకుని సక్సెస్ గారంటీ ఉంటేనే ఓ అడుగు ముందుకు వేసే ఈ రోజుల్లో చేసే పనిలో తప్పు లేదు. నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే చాలని ధైర్యంగా అడుగు ముందుకు వేసిన విశాల్ కి తమిళ యువత సోషల్ మీడియాలో జైజైలు కొడుతోంది. విశాల్ గెలుస్తాడా లేదా అన్నది పక్కనబెడితే ఆయన ముక్కుసూటితనం, ధైర్యం తమిళ యువతని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ఎన్నికలు నిజానికి జయ వారసులు ఎవరో తేలుస్తాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అనిశ్చితికి తెర వేయడానికి అక్కడి ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో విశాల్ గెలవొచ్చు, ఓడిపోవచ్చు. కానీ రాజకీయాలు అంటే లెక్కలు వేసుకుని విజయం పక్కా చేసుకునే ఆట స్థలం కాదన్న సంకేతాలు ఇచ్చాడు విశాల్ . క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకు నడవాలని యువతకి ఓ ధైర్యం , స్ఫూర్తి ఇచ్చాడు విశాల్. ఈ రెండు విషయాలు ఎంత సీనియర్ లు అయినా జూనియర్ అయిన విశాల్ దగ్గర రజని, కమల్ నేర్చుకోవాల్సిందే.