Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చాలా ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాజకీయాల్లో ప్రవేశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న సూపర్ స్టార్ ను సెలబ్రిటీలంతా అభినందనల్లో ముంచెత్తుతున్నారు. సినీ నటులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా రజనీకి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. కొందరు ఈ వార్తే న్యూస్ ఆఫ్ ది 2017 అని అభివర్ణించగా..మరికొందరు సినిమాల్లోలానే రాజకీయాల్లోనూ ఆయన తిరుగులేని విజయం సాధించాలని ఆకాంక్షించారు. మిత్రుడు, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ రజనీకి ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన స్నేహితుడు, సహ నటుడు, అద్భుతమైన వ్యక్తి అయిన రజనీకాంత్ ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ రంగంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అమితాబ్ ట్వీట్ చేశారు. సంఘటిత ప్రజాస్వామ్యం, అభివృద్ధిపై రజనీకాంత్ కు నమ్మకముందని తెలుసు.
ఆయన రాజకీయాల్లో విజయం సాధించాలని ఆశిస్తున్నాను అని ఖష్బూ వ్యాఖ్యానించారు. థాంక్యూ లీడర్…మీరు రాజకీయాల్లోకి రావాలన్న మా అందరి కల గుర్తుంది. మంచి చేద్దాం. మంచి గురించే మాట్లాడదాం. అప్పుడే మంచి జరుగుతుంది. లీడర్ అభిమానులు అందరికీ శుభాకాంక్షలు అని ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ అభినందనలు తెలిపారు. టాలీవుడ్ హీరో మోహన్ బాబు కూడా తన మిత్రుడికి శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన స్నేహితుడు రజనీకాంత్ కు ఆల్ ది బెస్ట్. సమాజానికి కావాల్సిన మార్పు ఆయన నాయకత్వం ద్వారా వస్తుందన్న నమ్మకం నాకుంది అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
2017లో న్యూస్ ఆఫ్ ది ఇయర్ ఇదే అని సూపర్ స్టార్ రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారు. జైహో అని అనుపమ్ ఖేర్ పోస్ట్ చేశారు. బాలీవుడ్ హీరో , మహారాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు, జెనీలియా భర్త రితీశ్ దేశ్ ముఖ్ కూడా సూపర్ స్టార్ ను ఉద్దేశించి ఆలోచింప చేసే ట్వీట్ పోస్ట్ చేశారు. కళారంగంలో ఆయన ప్రాణం పెట్టి కష్టపడ్డారు. ప్రజల ప్రేమ ఆయన్ను సూపర్ స్టార్ ను చేసింది. అదే ప్రేమ రాజకీయాల్లోకి వచ్చాక కూడా లభిస్తుందన్న నమ్మకం నాకుంది అని ట్వీట్ చేశారు. తమిళ ప్రజలు రజనీ వెంటే ఉంటారని, రాజకీయాల్లో కూడా ఆయనకు తిరుగులేదని దర్శకుడు లింగు స్వామి అన్నారు.