Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ వైపు ప్రజలు తాగు నీటి కోసం ఇబ్బందులు పడుతోంటే…ఈ ఐపీఎల్ మ్యాచ్ లు ఏంటని, ఈ మ్యాచ్ లు తనకు ఇబ్బందిని, చిరాకును కలిగిస్తున్నాయని మూడు రోజుల క్రితం వ్యాఖ్యానించి రజనీకాంత్ సంచలనం సృష్టించారు. ఆయన వ్యాఖ్యల ప్రభావమో లేక తమ డిమాండ్ ను జాతీయస్థాయిలో వినిపించాలన్న ఆలోచనో కానీ….కావేరీ బోర్డు ఏర్పాటు కోసం ఆందోళనలు చేస్తున్న నిరసనకారులు మంగళవారం ఐపీఎల్ మ్యాచ్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ను అడ్డుకునేందుకు రాజకీయ నాయకులు, కార్యకర్తలు స్టేడియం వద్ద చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు ఆందోళనకారులు పోలీసులపై దాడికి దిగారు. ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడంపై రజనీకాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. నిరసనకారులు ఓ పోలీసును కొడుతున్న వీడియోను రజనీ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇలాంటి ఆందోళనలు దేశానికి నష్టం చేకూర్చుతాయని, పోలీసులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక చట్టాలు ఉండాలని రజనీ డిమాండ్ చేశారు. కావేరీ జలాల సమస్యకు హింసాత్మక ఆందోళనలు పరిష్కారం కావన్నారు.కావేరీ బోర్టు ఏర్పాటు కోసం తమిళనాడు మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి పోరాడుతున్న నేపథ్యంలో తమిళుల ఆందోళనకు మద్దతుగా…చెన్నై జట్టు సభ్యులు, ప్రేక్షకులు నల్ల బ్యాడ్జిలు కట్టుకోవాలని మూడురోజుల క్రితం రజనీకాంత్ కోరారు. నీళ్లు లేక అల్లాడుతున్న రైతుల కష్టం అర్ధం చేసుకుని చెన్నైలో మ్యాచ్ లు ఆడకపోవడమే మంచిదని, అది కుదరకపోతే…మ్యాచ్ ఆడేటప్పుడు నల్ల బ్యాడ్జిలు కట్టుకోవాలని విజ్ఞప్తిచేశారు. అయితే చెన్నై ఆటగాళ్లు ఈ విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో….ఆందోళనకారులు మ్యాచ్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు.