Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏళ్లతరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ..తన రాజకీయ ప్రవేశంపై విస్పష్ట ప్రకటన చేసి సూపర్ స్టార్ రజనీకాంత్ 2017వ సంవత్సరానికి ఘనమైన ముగింపు పలికారు. తలైవా ప్రకటనతో ఆయన అభిమానులకు రెండు పండుగలు ఒకేసారి వచ్చినట్టయింది. తమిళనాడు వ్యాప్తంగా ఎక్కడ చూసినా రజనీ అభిమానుల కోలాహలమే. రహదారులపై టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటూ రజనీకి మద్దతుగా నినాదాలు చేస్తూ ఒకరోజు ముందే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. నూతన ఏడాది సందర్భంగా తలైవా తమకు ఇచ్చిన బహుమతి ఇదంటూ ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు.
రజనీ కటౌట్లకు అభిషేకాలు చేస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే కాదు..దేశవ్యాప్తంగా రజనీ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ అయింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో తలైవా రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన విషయాలే టాప్ ట్రెండింగ్ లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ, సూపర్ స్టార్, తలైవార్ పొలిటికల్ ఎంట్రీ, రజనీ ఫర్ తమిళనాడుతో ఉన్న హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. తలైవా రాజకీయప్రవేశంపై నెటిజన్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అటు రజనీ ప్రకటనపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఈ శతాబ్దంలో అత్యున్నత సంఘటనగా అభివర్ణించారు. రాజకీయ పార్టీని స్థాపించనున్నానంటూ రజనీ తన నిర్ణయాన్ని చెప్పే సమయంలో ఆయన తెరపై కన్నా వందరెట్లు ప్రభావవంతంగా కనిపించారని వర్మ కొనియాడారు. తమిళనాడులోని 234 స్థానాల నుంచి పోటీచేస్తానని చెప్పిన రజనీ ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలని వర్మ తన పోస్ట్ లో సూచించారు.