ఒక పరిపూర్ణమైన నటుడు అనిపించుకోవాలంటే దాని కోసం ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. దశాబ్ధాల కెరీర్ లో వైవిధ్యమైన పాత్రల్లో ప్రయోగాలు చేసినప్పుడే ఆ నటుడు చరిత్రలో నిలుస్తాడు. ధనార్జన కోసం కాకుండా నటనను ఫ్యాషన్ గా భావిస్తేనే ప్రయోగాలు చేయగలరు. విలక్షణమైన పాత్రల్ని ఎంపిక చేసుకోగలరు. ఈ విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అందరికీ ఆదర్శం. నాలుగున్నర దశాబ్ధాల కెరీర్ లో ఆయన చేయని ప్రయోగం లేదు. విలన్ గా మొదలై.. స్టార్ గా .. స్టారాధి స్టార్ గా.. సూపర్ స్టార్ గా తనని తాను ఆవిష్కరించుకునేందుకు ఆయన ప్రతి నిమిషం శ్రమించారు. ప్రతిదీ కొత్తగా విలక్షణంగా ఆలోచించారు. ప్రయత్నించి సాధించారు.
అయితే ఇన్నేళ్ల కెరీర్ లో ఆయనకు ఏ లోటూ లేదా చేయాలనుకుని చేయలేకపోయిన పాత్ర ఏదైనా ఉందా అంటే రజనీ చెప్పిన మాట అభిమానుల్ని విస్మయపరిచింది. 45 ఏళ్ల కెరీర్ లో హిజ్రా పాత్రను చేయలేదు… అవకాశం వస్తే చేస్తాను! అని రజనీ దర్బార్ ట్రైలర్ ఈవెంట్ అనంతరం ఇంటర్వ్యూలో అన్నారు. ఇన్నేళ్లలో ఆ తరహా పాత్రను ఎవరూ ఆఫర్ చేయలేదా? అని ప్రశ్నిస్తే… ఇప్పుడే మైండ్ లోకి వచ్చింది. ఎవరూ నన్ను ఆ పాత్ర కోసం కలవలేదు.. అని తెలిపారు.
దీంతో పాటే వేరొక కోరిక గురించి రజనీ చెప్పారు. నేను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని కాబట్టి అక్కడా ఓ సినిమా చేయాలి. మరాఠా సినిమాలో నటిస్తాను! అని అన్నారు. శివాజీరావ్ గైక్వాడ్ రజనీ అసలు పేరు. బెంగళూరులో ఓ మరాఠా కుటుంబంలో జన్మించినా నటుడయ్యాక మద్రాసులో సెటిలయ్యారు. గత 45 ఏళ్లలో రజనీ ప్యాషన్ ఎలాంటిదో చూస్తూనే ఉన్నాం. ఇక రజనీ ఇంట్లో ఉన్నప్పుడు పక్కాగా మరాఠా మాట్లాడతారు. ఇంతకుముందు ఓసారి మరాఠాలో ఆఫర్ వచ్చినా అది వర్కవుట్ కాలేదు. కానీ మరాఠా చిత్రం చేయాలన్న కోరిక మాత్రం అలానే ఉండిపోయిందట.